జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/  వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది 2 సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ పరీక్ష జనవరిలో, రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ లో ఉంటుంది. మొదటి సెషన్ పరీక్ష జనవరి 24, 25, 27, 28, 29, 30,31 తేదీల్లో జరగనుంది. ఇక రెండో సెషన్ పరీక్షను ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో నిర్వహిస్తారు. తెలుగు సహా దేశంలోని 13 భాషల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష కోసం అభ్యర్థులు డిసెంబరు 15 నుంచి జనవరి 12వ తేదీన రాత్రి 9 గంటల మధ్య ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జనవరి 12న రాత్రి 11 గంటల 50 నిమిషాల్లోగా అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ అనేది బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఉంటుంది. రెండో పేపర్ అనేది బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఉంటుంది.  జేఈఈ మెయిన్ సిటీ ఆఫ్ ఎగ్జామిషన్ వివరాలను  జనవరి రెండో  వారంలో విడుదల చేస్తారు. దీని ద్వారా తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందనే దానిపై విద్యార్థులు ముందస్తుగా స్పష్టతకు రావచ్చు. తగిన ప్రణాళికతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇక జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను జనవరి మూడో వారంలో జారీ చేస్తారు. 

మరోవైపు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ రాత్రి 9 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించొచ్చు. అయితే మార్చి 7న రాత్రి 11 గంటల 50 నిమిషాల్లోగా అప్లికేషన్  ఫీజును కట్టాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసేక్రమంలో ఇబ్బంది ఎదుర్కొనే వారు, దీనితో ముడిపడిన సందేహాలున్న వారు  011 – 40759000 / 011 – 69227700 నంబర్లకు పనిదినాల్లో కాల్ చేయొచ్చు. లేదంటే jeemain@nta.ac.in కు మెయిల్ చేయొచ్చు.