Jeff Bezos: పార్టీ చేసేందుకు ద్వీపాన్ని కొననున్న జెఫ్​బెజోస్

Jeff Bezos: పార్టీ చేసేందుకు ద్వీపాన్ని కొననున్న జెఫ్​బెజోస్

చుట్టూ సముద్రం. మధ్యలో హార్ట్ షేప్ లో ఉండే ఐలాండ్. అందులో పార్టీ.. ప్రకృతి ప్రేమికులకి ఇంతకన్నా ఇంకేంకావాలి. అలాంటిదే క్రొయేషియాలోని గాలెసెన్‌జక్ అనే ద్వీపాన్ని కొనుగోలు చేయడానికి అమెరికన్ పాప్ సింగర్ బెయోన్స్ నోలెస్, జెఫ్ బెజోస్, బాస్కెట్ బాల్ ప్లేయర్ మైకెల్ జోర్డాన్‌లు పోటీ పడుతున్నారు. దాంతో క్రొయేషియా గవర్నమెంట్ ద్వీపంలోని కొంత భాగాన్ని 11 మిలియన్ డాలర్లకు (రూ.91కోట్లకు) అమ్మకానికి ఉంచింది. అయితే, ఈ ద్వీపానికి ఎందుకంత ప్రత్యేకత అంటారా..

ప్రస్తుతం ఈ ద్వీపంలో ఎవరూ నివసించట్లేదు. కానీ, దాదాపు 7,000 సంవత్సరాల క్రితం అక్కడ జనావాసం ఉండేదని జాదర్ విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. అయితే, 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో గత కొంతకాలంగా పర్యటకుల తాకిడి పెరిగింది. ప్రముఖ సెలబ్రెటీలు చాలామంది బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లని ఈ ద్వీపంలో జరుపుకుంటున్నారు. బెయోన్స్ నోలెస్ తన 39వ బర్త్‌డే పార్టీని, జెఫ్‌ బెజోస్ తన ప్రైవేట్ పార్టీలను, మైకెల్ జోర్డాన్‌కి వేసవి విడిదిగా ఉంది. ఈ ద్వీపంలో రెస్టారెంట్, హోటల్స్ లాంటివి ఏం లేకున్నా పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. 

దాంతో క్రొయేషియా గవర్నమెంట్ దీన్ని పర్యటక ప్రాంతంగా మార్చాలనుకుంటోంది. అందుకే ఐలాండ్‌లోని కొంత భాగాన్ని అమ్మకానికి పెట్టింది. అలా వచ్చిన డబ్బుని ఐలాండ్ అభివృద్ధికి వినియోగించాలనుకుంటున్నామని క్రొయేషియా అధికారిక ప్రతినిధి కర్దుమ్ తెలిపారు.