తగ్గిన జెఫ్ బెజోస్ సంపద.. రెండో అత్యంత ధనవంతుడు టైటిల్ లాస్

తగ్గిన జెఫ్ బెజోస్ సంపద.. రెండో అత్యంత ధనవంతుడు టైటిల్ లాస్
  • ఈయన స్థానంలోకి లారీ ఎల్లిసన్

న్యూఢిల్లీ: అమెజాన్ ఫౌండర్​ జెఫ్ బెజోస్ ‘ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడు’ అనే తన టైటిల్​ను కోల్పోయారు. ఎనిమిది సంవత్సరాల పాటు ఆ స్థానంలో కొనసాగిన బెజోస్​ను ఒరాకిల్  కో–ఫౌండర్ ​లారీ ఎల్లిసన్ దాటేశారు. తాజా ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్​ ప్రకారం, లారీ ఎల్లిసన్ నికర సంపద ఒక్కరోజే 26 బిలియన్ డాలర్ల మేర పెరిగి 243 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒరాకిల్ సంస్థ ఆదాయం భారీగా పెరగడమే ఇందుకు కారణం. కంపెనీ స్టాక్ విలువ 200 డాలర్ల మార్కును మొదటిసారి అధిగమించింది. దీంతో ఎల్లిసన్ నికర సంపద జెఫ్ బెజోస్ (227 బిలియన్ డాలర్లు),  మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ (239 బిలియన్ డాలర్లు)లను దాటింది. ఆయన ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 407.3 బిలియన్ డాలర్లతో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. గత అక్టోబర్​లో మెటా సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ జెఫ్ బెజోస్​ను అధిగమించి రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో జుకర్​బర్గ్ నికర సంపద 78 బిలియన్ డాలర్లు పెరిగి 206.2 బిలియన్ డాలర్లకు చేరగా, బెజోస్ సంపద 205.1 బిలియన్ డాలర్లుగా రికార్డయింది. అమెజాన్ స్టాక్ విలువ పెరగడంతో జెఫ్ బెజోస్ 2017 సంవత్సరంలో 75.6 బిలియన్ డాలర్ల సంపదతో తొలిసారిగా ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అప్పుడు ఆయన వారెన్ బఫెట్​ను అధిగమించారు.