సింగరేణి జాగలకు పట్టాలెప్పుడో .. వేలల్లో పెండింగ్ ​అప్లికేషన్లు 

సింగరేణి జాగలకు పట్టాలెప్పుడో .. వేలల్లో పెండింగ్ ​అప్లికేషన్లు 
  • గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తుల విచారణ టైంలోనే సైట్​ క్లోజ్
  • కోల్​బెల్ట్​ ప్రాంత ఎమ్మెల్యేలు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం, ఇల్లెందు, మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో సింగరేణి స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నా ఆ భూమిపై  ప్రజలకు ఎటువంటి హక్కు లేకుండా పోయింది. ఈ క్రమంలో 2017లో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ సింగరేణి స్థలాల్లో ఏండ్ల కాలంగా ఉంటున్న వారి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో నంబర్​ 76ను జారీ చేసింది. సింగరేణి స్థలాల్లో ఉంటూ ఎటువంటి అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారి స్థలాలను రెగ్యులరైజ్​ చేసుకునేందుకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలా మంది దరఖాస్తు చేసుకొని క్రమద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.

మొదటి దశలో 7,046 దరఖాస్తులు 

2014 జూన్​ ముందు వరకు సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారి ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ కోసం అధికారులు సింగరేణి వ్యాప్తంగా దరఖాస్తులు తీసుకున్నారు. 2019 డిసెంబర్​31నాటికి కొత్తగూడెంలో 7,046 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 4,749 దరఖాస్తులను వివిధ  కారణాలతో అధికారులు రిజెక్ట్​ చేశారు. అర్హులైన వారి దరఖాస్తులను కూడా రిజెక్ట్​ చేశారని అప్పట్లో కలెక్టర్లు​ఎంవీ రెడ్డి, డి. అనుదీప్​కు ప్రజలు విన్నవించారు. అధికారులు ఇష్టారాజ్యంగా విచారణ చేపట్టడం వల్లే వేలల్లో దరఖాస్తులు రిజెక్ట్​ అయ్యాయని అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండో దశలో 1,539 అప్లికేషన్లు

రెండో దశలో భాగంగా ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76కు అనుబంధంగా జీవో 62ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2022 ఆగస్టు 12 నాటికి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను మరోసారి ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ క్రమంలో దాదాపు 1,539 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో కేవలం 439 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ప్రజలు  ఆఫీసర్ల తీరుపై ఫైర్​ అయ్యారు.

మూడోసారి దరఖాస్తుల స్వీకరణ 

దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్​లో ఉండడంతో కోల్​ బెల్ట్​ ఎమ్మెల్యేలు తిరిగి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవో28 ద్వారా మరోసారి దరఖాస్తులను స్వీకరించింది. 2014 జూన్​ 2 నుంచి 2020 జూన్​2 వరకు ఆక్రమణల్లో ఉన్న ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు  దరఖాస్తులను2023 జూన్​ 30 వరకు తీసుకునేందుకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ క్రమంలో మూడో దశలో కొత్తగూడెంలో 2,241, ఇల్లెందులో 1,786, చుంచుపల్లిలో 2, లక్ష్మీదేవిపల్లిలో 2 దరఖాస్తులు వచ్చాయి. 

సైట్​ క్లోజ్.. ఆఫీసర్లు  సైలెంట్​

దరఖాస్తులపై విచారణ జరుగుతున్న క్రమంలోనే అప్లికేషన్ల అప్​డేట్​కు సంబంధించిన సైట్​ క్లోజ్​ కావడంతో ఆఫీసర్లు రెగ్యులరైజేషన్​ విషయాన్ని పక్కన పెట్టారు. ఇదే టైంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి షురూ కావడంతో అధికారులు దరఖాస్తుల సంగతే మర్చిపోయారు. దీంతో క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు తహసీల్దార్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు ప్రక్రియ మొదలవుతుందని ఆఫీసర్లు చెపుతున్నారు. 

దళారులు ఆఫీసర్లతో కుమ్ముక్కై..!

ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ టైంలో కొందరు దళారులు ఆఫీసర్లతో కుమ్ముక్కై  ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దళారులు, ఆఫీసర్లు అడిగినంత డబ్బులు ఇవ్వలేని వారి దరఖాస్తులను కుంటి సాకులతో రిజెక్ట్​ చేసిన ఘటనలు ఉన్నాయి. కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ఏరియా, కూలీ లైన్, రైటర్​బస్తీ గొల్లగూడెం ప్రాంతాల్లోని పలువురికి చెందిన దరఖాస్తుల్లో చూపించిన ల్యాండ్​ కన్నా తక్కువ చూపించి అన్యాయం చేశారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. 

ఎమ్మెల్యేలు స్పందిస్తేనే పని..

సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారి ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్​ దరఖాస్తులపై కోల్​ బెల్ట్​ ఎమ్మెల్యేలు స్పందిస్తేనే పరిష్కారమవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.  విషయాన్ని సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. పెండింగ్​ దరఖాస్తులతో పాటు 2023 డిసెంబర్​ 31 వరకు సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి రెగ్యులరైజేషన్​ చేసుకునేందుకు అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.