క్రీడా స్ఫూర్తిని రగిలించే సినిమా జెర్సీ : వెంకీ

క్రీడా స్ఫూర్తిని రగిలించే సినిమా జెర్సీ : వెంకీ

హైదరాబాద్ : జెన్యూన్ చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి సినిమాాల్లోనే పూర్తిగా లీనమై నటించగల పాత్రలు దొరుకుతాయి. అలా ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా ఎమోషనల్ అవుతాం. ఫస్ట్ లుక్ మొదలు ట్రైలర్ వరకూ ఆ ఎమోషన్ ‘జెర్సీ’లో కనిపించింది’ అన్నారు వెంకటేష్. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ..‘నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఇక్కడికొచ్చానని అందరూ అనుకుంటున్నారు. కేవలం క్రికెట్ కోసమే కాదు… సినిమా మీద, జెర్సీ మీద ఇష్టంతో వచ్చాను. ఫస్ట్ లుక్, టీజర్ చూసినప్పుడే ఇంప్రెస్ అయిపోయాను. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. గౌతమ్‌‌ చాలా క్లారిటీతో తీశాడనిపిస్తోంది. ఈ సినిమా చేసినందుకు నానిని అభినందిస్తున్నాను. తను చాలా మంచి నటుడు. ‘అష్టాచెమ్మా’ నుంచి తనను చూస్తున్నాను. ఇలాంటి నటుడు ఉన్నందుకు మనమంతా గర్వపడాలి. స్ఫూర్తిని రగిలించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్ట్రగులవుతారు. కానీ నిరాశ పడకుండా అనుకున్నది సాధించేవరకూ కష్టపడాలి. ఆ విషయాన్నే నాని ఇందులో చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇది కేవలం సినిమా కాదని, ఓ మంచి పాఠమని అందరికీ అనిపిస్తుం ది’ అంటూ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు వెంకీ.

నాని మాట్లాడుతూ ‘వెంకటేష్ గారి సినిమా ఫంక్షన్‌‌కి వెళ్లాలన్న కోరిక ‘బాబు బంగారం’తో తీరింది. ఆయన నా ఫంక్షన్‌‌కి రావాలన్న కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఇద్దరం కలిసి సినిమా చేయాలన్న కోరిక కూడా నెరవేరితే అదృష్టంగా భావిస్తాను. ఇక ఏప్రిల్ 19న ఈ సినిమా చూశాక డైరెక్టర్‌‌‌‌ని చూసి, నన్ను చూసి, శ్రద్ధని చూసి, ఈ టీమ్‌‌ అందరినీ చూసి మీరు గర్వపడతారు. అందరూ గర్వించదగ్గ సినిమాలో భాగమైనందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ సినిమా విషయంలో బ్లాక్‌‌బస్టర్‌‌‌‌ లాంటి మాటలు వాడటం ఇష్టం లేదు. ఒక మంచి సినిమా పక్కన అలాంటి పదాలు చేర్చకూడదు. ఈ సినిమాని ఇంత అందంగా మలచడానికి గౌతమ్ ఎంతో కష్టపడ్డడాడు. ఈరోజు కూడా చివరి నిమిషం వరకూ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తూ ఈ వేడుకకు రాలేకపోయాడు. మా నటన, అనిరుధ్ సంగీతం, సాను సినిమాటోగ్రఫీ, నవీన్ ఎడిటింగ్.. ఇలా అన్నీ కలసి ఈ సినిమా కథని చెపుతాయి. ఒక మంచి కథను చెప్పే గొప్ప సినిమా చేశాననే ఫీలింగ్‌‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రైలర్ స్టైల్లో చెప్పాలంటే… ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను ఇంతవరకూ జడ్జ్ చేయనిది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తక్కువైనా తట్టుకోలేను’ అన్నారు.