ప్లాస్టిక్ వేస్ట్​ నుంచి జెట్ ఫ్యూయల్

ప్లాస్టిక్ వేస్ట్​ నుంచి జెట్ ఫ్యూయల్
  • అడ్వాన్స్‌‌డ్ రీసైక్లింగ్ పద్ధతిలో గంటలోపే తయారీ
  • వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టుల ఇన్నోవేషన్

ఇప్పుడు మనిషి జీవితం అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ వాడే వస్తువుల్లో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌‌తో చేసినవే ఉంటున్నాయి. వాటర్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్, పార్సిల్ కవర్స్, ఫుడ్ కంటైనర్స్, డిస్బోజబుల్ గ్లాసులు అంటూ ఇలా రకరకాల వస్తువులను ఒక్కసారి వాడి పడేస్తున్నారు.  దీని వల్ల ఎటు చూసిన ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువైపోయింది. చెత్త కుప్పలు, మోరీలు మొదలు నదులు, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. పైగా ఇవి భూమిలో కరిగిపోవడానికి వందల, వేల సంవత్సరాల టైమ్‌‌ పడుతుంది. ఈ సమస్య  తీరాలంటే రీసైక్లింగ్ ఒక్కటే మార్గం. అప్పటికే వేర్వేరు మార్గాల్లో రీసైక్లింగ్ జరుగుతున్నా.. అది మనం వాడి పడేస్తున్న దాంట్లో రెండు శాతమే ఉంటోందని ఓ అంచనా. అయితే ఇప్పుడు కొత్తగా అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌‌లో ఓ వినూత్న టెక్నిక్‌‌ను డెవలప్ చేశారు. ఈ అడ్వాన్స్‌‌డ్ మెథడ్ ద్వారా చాలా ఖరీదు ఉండే జెట్ ఫ్యూయల్ తయారు చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

తక్కువ టైమ్‌‌లో పూర్తయ్యే ప్రాసెస్
ప్లాస్టిక్‌‌లో మూల పదార్థం పాలీఇథైలీన్. ఈ మెటీరియల్‌‌ నుంచే మనం వాడే కవర్లు మొదలు బాటిల్స్, బాక్సులు, ఫర్నీచర్, పైపులు అన్నీ తయారు చేస్తారు. భూమి మీద మనం చూసే అన్ని ప్లాస్టిక్ వస్తువుల్లో మూడో వంతు మెటీరియల్స్‌‌ దీనితో తయారైనవే. ఏటా సుమారు రూ.14.6 లక్షల కోట్ల విలువైన వస్తువులు తయారవుతున్నాయి. ఈ పాలిమర్ మెటీరియల్స్‌‌ను వేస్ట్‌‌గా పడేసి నదులు, పర్యావరణాన్ని కలుషితం చేసే బదులు వ్యాల్యుబుల్ వస్తువులు తయారీకి ఎంతమేరకు ఉపయోగపడుతాయన్న దానిపై వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు దృష్టి పెట్టారు. తమ ప్రయోగాల్లో కార్బన్ క్యాటలిస్ట్ రుథేనియం సాయంతో ప్రాసెస్ చేస్తే ప్లాస్టిక్‌‌ నుంచి విమానాలను నడిపించే ఇంధనంతో పాటు హై వ్యాల్యూ ఉండే లూబ్రికెంట్స్ తయారు చేయొచ్చని గుర్తించారు. రెగ్యులర్‌‌‌‌గా ఒక సాల్వెంట్‌‌గా వాడే రుథేనియం ద్వారా చేసే ఈ క్యాటలిస్టిక్ ప్రాసెస్‌‌ గంటలోపే పూర్తవుతుందని సైంటిస్టులు తెలిపారు. 

హీట్, టైమ్‌‌ను బట్టి ఔట్‌‌పుట్
‘గతంలో కొన్ని రీసెర్చ్‌‌లలో కేవలం పాలిథిన్ కవర్లు లాంటి వాటి నుంచి డీజిల్ తయారీ ప్రాసెస్‌‌ను డెవలప్ చేశారు. అవి చాలా కాస్ట్లీ, ఎక్కువ టైమ్, శ్రమతో కూడుకున్న పద్ధతులు. అయితే  ఇప్పుడు మేం అభివృద్ధి చేసిన కొత్త ప్రాసెస్‌‌ ద్వారా మనం వాడే 90 శాతం పైగా వస్తువుల నుంచి జెట్‌‌ ఫ్యూయల్, ఇతర హైడ్రో కార్బన్ ప్రొడక్ట్స్‌‌ తయారు చేయొచ్చు’ అని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీర్ హాంగ్‌‌ఫీ లిన్ అన్నారు. 220 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ప్లాస్టిక్‌‌ను కరిగించి చాలా తక్కువ టైమ్‌‌లో ఈ ప్రాసెస్‌‌ పూర్తి చేయొచ్చని చెప్పారు. హీట్, టైమ్‌‌, క్యాటలిస్ట్ వాడే మోతాదును మార్చడం ద్వారా మనం పొందే ఔట్‌‌పుట్‌‌ ప్రాడక్ట్ ఉంటుందన్నారు. మార్కెట్‌‌లో అవసరాన్ని బట్టి కావాల్సిన ప్రొడక్ట్‌‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. 

ప్రాసెస్‌‌ను కంపెనీలతో షేర్‌‌‌‌ చేస్తాం
ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెథడ్స్ శ్రమ, ఖర్చుతో కూడుకున్నవి. పైగా వచ్చే ఔట్‌‌పుట్ ప్రొడక్ట్స్‌‌ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. అందుబాటులో ఉన్నవాటిలో ఎక్కువ భాగం మెకానికల్ రీసైక్లింగ్ పద్ధతులే. అయితే తాము డెవలప్‌‌ చేసిన కెమికల్ రీసైక్లింగ్ టెక్నిక్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఖరీదైనవి కావడంతో ప్లాస్టిక్ వేస్ట్‌‌ సమస్యకు ఇదే మంచి పరిష్కారం అవుతుందని లిన్ ధీమా వ్యక్తం చేశారు.  తక్కువ ప్రాసెసింగ్ టైమ్ కూడా ఒక అడ్వాంటేజ్ అన్నారు. ప్లాస్టిక్ ఇండస్టీలో ఉన్న కంపెనీలకు ఈ కొత్త టెక్నిక్‌‌తో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా ఎక్కువ ఖర్చేంకాదని చెప్పారు. ఈ టెక్నాలజీ కమర్షియలైజేషన్‌‌కు తాము సిద్ధంగా ఉన్నామని, ముందుకు వచ్చే కంపెనీలతో చర్చించి వాటితో దీనిని షేర్ చేసుకుంటామని అన్నారు.

ప్లాస్టిక్ వేస్ట్ వల్ల హెల్త్ సమస్యలు
ప్లాస్టిక్ వేస్ట్ నదులు, ఇతర వాటర్ రిసోర్సెస్‌‌లో చేరడం వల్ల పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తోంది. ఆ నీటిలో కరిగి మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి ప్రవేశిస్తోందని గత ఏడాది అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్‌‌లో తేలింది. ఈ మైక్రో ప్లాస్టిక్ వల్ల కిడ్నీ, లివర్, లంగ్స్‌‌పై ఎఫెక్ట్ పడుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నదులు, సముద్రాల్లో ఉండే జంతువులపై చేసిన ప్రయోగాల్లో వాటి శరీర అవయవాల్లో మైక్రో ప్లాస్టిక్‌‌ను గుర్తించినట్లు ఆ స్టడీలో వెల్లడించారు. దీని వల్ల వాటికి సంతాన సమస్యలు, కేన్సర్ లాంటి జబ్బుల బారినపడే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. సీ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ఇతర అనేక మార్గాల ద్వారా ఈ మైక్రో ప్లాస్టిక్ మనుషుల శరీరంలోకి కూడా ప్రవేశిస్తుందని సైంటిస్టులు తెలిపారు. అయితే దీని వల్ల మనుషులపై ఏ స్థాయిలో ఎఫెక్ట్ పడుతుందన్న దానిపై మరింత లోతుగా రీసెర్చ్ జరగాల్సి ఉందన్నారు. అయితే  మైక్రో ప్లాస్టిక్‌‌ వల్ల మన ఇమ్యూనిటీకి మూలమైన తెల్ల రక్త కణాలు డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉందని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల మనకు తెలియకుండానే రకరకాల జబ్బుల బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ పాలిమర్‌‌‌‌ మెటీరియల్స్‌‌ చివరిగా రక్తం ద్వారా కిడ్నీ, లివర్ వంటి భాగాల్లోకి చేరుతాయని, దీని వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందనేదానిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు.