
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందన్న నమ్మకం కారణంగా వీటి అమ్మకాలు మంగళవారం జోరుగా సాగాయి. నగల షాపులన్నీ కళకళలాడాయి. ఎండలు మొదలుకాకముందే కస్టమర్లు.. ముఖ్యంగా ఆడవాళ్లు షాపులకు క్యూ కట్టారు. రంజాన్ కారణంగా సెలవు కూడా కావడంతో దుకాణాలన్నీ బిజీబిజీగా కనిపించాయి. ఈ ఒక్క రోజే దేశవ్యాప్తంగా 30 టన్నుల వరకు బంగారం అమ్ముడవుతుందని బులియన్‌వర్గాలు భావిస్తున్నాయి. ‘‘నగల వ్యాపారులు దేశవ్యాప్తంగా తమ దుకాణాలను ముందుగానే తెరిచారు ఉదయం నుండే కస్టమర్ల రాక మొదలైంది. గడచిన 10–-15 రోజుల నుండి మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. ఇది అక్షయ తృతీయ రోజున కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. ఈ పర్వదినాన 25–-30 టన్నుల వ్యాపారం జరుగుతుందని అనుకుంటున్నాం” అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ శ్యామ్ మెహ్రా తెలిపారు. ఈ అక్షయ తృతీయ అమ్మకాలకు అధిక ధరలు అడ్డంకిగా మారతాయా ? అన్న ప్రశ్నకు.. బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 55,000–-58,000 నుండి రూ. 50,500 వరకు తగ్గాయని, ఫలితంగా కస్టమర్ల సెంటిమెంట్ పెరుగుతుందని జవాబిచ్చారు. ధరలు తగ్గినందున మార్కెట్లో సాధారణంగానే సానుకూల సెంటిమెంట్ ఉంది. బంగారం ధరలు మున్ముందు పెరుగుతాయని, ఇది అమ్మకాలను పెంచడానికి కూడా సహాయపడుతున్నదని మెహ్రా వివరించారు. పీఎన్జీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ షాపులన్నీ రద్దీగా ఉన్నాయని, రాత్రి వరకు అమ్మకాలు భారీగా జరుగుతాయని వివరించారు. కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ సంప్రదాయంగా బంగారం కొనడం అక్షయ తృతీయ నాడు సహజమని, ఈసారి పెళ్లిళ్ల సీజన్ కూడా తమకు కలసి వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు అక్షయ తృతీయ తూర్పు, దక్షిణ భారత్‌లోనే ఎక్కువ ఉండేదని, ఇప్పుడు దేశమంతటా ఈ పర్వదినాన బంగారం కొంటున్నారని చెప్పారు. రెండు సంవత్సరాలపాటు లాక్డౌన్లతో ఇబ్బందిపడ్డామని, ఈ సంవత్సరం తమ షోరూమ్‌లు 100 శాతం పని చేస్తున్నాయని అన్నారు. ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన. క్యారట్‌లేన్ సీఓఓ, కో–ఫౌండర్అవనీశ్ ఆనంద్ మాట్లాడుతూ, రోజురోజుకూ వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతున్నదని, పెంటప్ డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతీయ మార్కెట్ కొనుగోలు సామర్థ్యం పెరిగిందని వివరించారు.
బంగారం కొనేందుకు 3 మంచి పద్ధతులు
చాలా మంది బంగారాన్ని అలంకరణకు బదులు ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటుంటారు. ఏ రూపంలో కొనాలనే విషయంలో క్లారిటీ ఉండదు. పసిడి కొనేందుకు మూడు మంచి పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1 గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్):
బంగారాన్ని షాపుల్లో కొని దాచి పెట్టడం కొద్దిగా రిస్కీయేగాక రాబడి ఉండదు. ఇందుకు బదులు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇందులోని ప్రతి యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానం. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి కనీసం ఒక గ్రాము నుంచి కొనాలి. ఇందుకు డీమాట్, ట్రేడింగ్ ఖాతా కావాలి. షేర్ల మాదిరిగానే బ్రోకర్ ద్వారా ఈటీఎఫ్‌లను కొనొచ్చు. బంగారాన్ని వాల్ట్‌లలో భద్రపరుస్తారు. ఒక కస్టోడియన్‌ను కూడా నియమిస్తారు. బంగారం ధరలు పెరిగే లాభాలు వస్తాయి. కావాలంటే మన యూనిట్లను సాధారణ బంగారంగానూ మార్చుకోవచ్చు.
2 గోల్డ్ సేవింగ్స్ ఫండ్
బంగారాన్ని ఒకేసారి కొనిపెట్టుకోవడానికి బదులు చిన్నచిన్న మొత్తాల్లో కొనడానికి ఈ ఫండ్ ద్వారా వీలవుతుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్. కార్పస్‌ను గోల్డ్ ఈటీఎఫ్‌లలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్టర్ల డబ్బుతో సాధారణ బంగారాన్నే కొంటారు. ఏదైనా ఫండ్ హౌస్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. నెలకు కనీసం రూ.500 పెట్టుబడితో సిప్ చేయవచ్చు.
3 సావరిన్ గోల్డ్ బాండ్స్
ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. కనీసం ఒక గ్రాము బంగారంతో పెట్టుబడి మొదలుపెట్టాలి. ఎనిమిది సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. ఐదవ సంవత్సరం చివరిలోనూ ఇన్వెస్ట్మెంటును వెనక్కి తీసుకోవచ్చు. ఈ బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా లేదా ఏజెంట్ ద్వారా బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది. వడ్డీ మీ బ్యాంక్ ఖాతాకు ఆరు నెలలకు ఓసారి జమ అవుతుంది. చివరి వడ్డీని అసలుతో పాటు మెచ్యూరిటీపై ఇస్తారు. వడ్డీపై టీడీఎస్ వసూలు చేయరు.
లాక్డౌన్ల కారణంగా పోయిన రెండేళ్లలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ లేదు కాబట్టి పరిస్థితి మెరుగుపడింది. అక్షయతృతీయ మొత్తం అమ్మకాల విలువ రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. 2019లో రూ.పది వేల కోట్ల విలువైన పుత్తడి అమ్ముడయింది. బంగారం ధరలు తగ్గడం వల్ల సేల్స్ బాగున్నాయి.
- ప్రవీణ్ ఖండేల్వాల్, జనరల్ సెక్రటరీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్