IND vs NZ: ఇండియాతో నాలుగో టీ20.. స్టార్ ప్లేయర్స్‌ను బరిలోకి దించిన న్యూజిలాండ్

IND vs NZ: ఇండియాతో నాలుగో టీ20.. స్టార్ ప్లేయర్స్‌ను బరిలోకి దించిన న్యూజిలాండ్

ఇండియా, న్యూజిలాండ్ జట్లు నాలుగో టీ20 మ్యాచ్ కు సిద్ధమయ్యాయి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మూడు టీ20లను ఇప్పటికే ఇండియా గెలిచి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. బుధవారం (జనవరి 28) ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 జరగనుంది. చివరి రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని సూర్య సేన లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన కివీస్ బోణీ కోసం పోరాడుతుంది. ఇందులో భాగంగా జట్టును పటిష్టం చేసుకునే పనిలో ఉంది. చివరి రెండు టీ20ల  కోసం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ను జట్టులోకి చేర్చుకుంది.

ఎక్స్ ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ తో పాటు స్టార్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ మంగళవారం (జనవరి 27) కివీస్ స్క్వాడ్ లో చేరారు. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న వీరిద్దరూ ఇండియాతో చివరి రెండు టీ20 లకు అందుబాటులో ఉండనున్నారు. ఫిన్ అలెన్ చివరి టీ20కి అందుబాటులో ఉంటాడు. ఫెర్గూసన్, నీషమ్ జట్టులో చేరడంతో క్రిస్టియన్ క్లార్క్, టిమ్ రాబిన్సన్‌లను తమ జట్టు నుండి రిలీజ్ చేసింది. సిరీస్ ఓడిపోయినా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం ఇండియా పిచ్ లపై పట్టు సాధించాలని  న్యూజిలాండ్ భావిస్తుంది.

లాకీ ఫెర్గూసన్, జిమ్మీ నీషమ్ ఇద్దరూ కూడా నాలుగో టీ20 తుది జట్టులో ఉండడం ఖాయంగా మారింది. వీరిద్దరూ జట్టులో చేరడంతో న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. ఈ సిరీస్ లో కివీస్ బ్యాటింగ్ లో రాణిస్తున్నా.. బౌలింగ్ లో పూర్తిగా చేతులెత్తేస్తుంది. డఫీ మినహాయిస్తే మిగిలిన వారు ఘోరంగా విఫలమవుతున్నారు. గతేడాది టెస్టుల్లో, ఈ నెలలో వన్డేల్లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌.. షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మాత్రం తేలిపోతోంది. వరుసగా మూడు  ఓటములతో 0–3తో వెనకపడిన కివీస్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. చివరి రెండు టీ20ల్లో ఇండియాకు గట్టి ఇచ్చి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టాలని చూస్తుంది. 

చివరి రెండు టీ20లకు న్యూజిలాండ్ స్క్వాడ్:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జకారీ ఫౌల్కేస్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, ఇష్ సోధి