రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 సెమీస్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ ఎ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఎ చేజేతులా ఓడిపోయింది. ఓడిపోయే మ్యాచ్ ను డ్రా చేసుకొని సూపర్ ఓవర్ కు వెళ్లిన ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో సెమీస్ లోనే ఇండియా ఏ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ పై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ లో ఎంతో వెలుగు వెలిగిన యువ క్రికెటర్లు బంగ్లాదేశ్ లాంటి సామాన్యమైన జట్టుతో రాణించలేక ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమికి కెప్టెన్ జితేష్ శర్మ ఒక్కడే కారణమని అర్ధమవుతుంది. జితేష్ చేసిన రెండు తప్పుల కారణంగానే ఇండియా ఓడిపోయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నమన్ ధీర్ కు 19 ఓవర్:
జితేష్ కుమార్ ఇన్నింగ్స్ 19 ఓవర్ ను పార్ట్ టైమ్ బౌలర్ కి ఇచ్చి ప్రయోగం చేయడం కొంపముంచింది. బంగ్లాదేశ్ తొలి 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో 19 ఓవర్ పార్ట్ టైమ్ స్పిన్నర్ నమన్ ధీర్ కి ఇచ్చి పిచ్చి ప్రయోగం చేశాడు. ఈ ఓవర్ లో బంగ్లాదేశ్ ఏకంగా 28 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్ లో మెహరూబ్ 4 సిక్సర్లు.. ఒక ఫోర్ తో స్కోర్ కార్డు శరవేగంగా ముందుకెళ్లింది. రమణ్ దీప్ సింగ్ లాంటి ఆల్ రౌండర్ ఉన్నప్పటికీ నమన్ కు బౌలింగ్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది.
సూపర్ ఓవర్ లో చెత్త బ్యాటింగ్:
సూపర్ ఓవర్ లో జితేష్ శర్మ తొలి బంతికే తన చెత్త షాట్ సెలక్షన్ కారణంగా వికెట్ కోల్పోయాడు. సూపర్ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ కు దించకుండా కెప్టెన్ అని తాను బ్యాటింగ్ కి దిగి తొలి బంతికే బౌల్డయ్యాడు. రివర్స్ స్వీప్ చేసి జితేష్ ఔట్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ లో స్టంపింగ్ మిస్ చేసి ఇండియా ఓటమికి కారణమయ్యాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్ రెహమాన్ సోహన్ హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో మెహెరోబ్ 18 బంతుల్లోనే 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో ఇండియా ఏ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (38), ప్రియాంష్ ఆర్య (44) సూపర్ స్టార్ట్ ఇవ్వగా.. జితేష్ శర్మ (33), నేహాల్ వధేరా (32) రాణించారు.
చేజేతులా పోగొట్టుకున్న టీమిండియా?
ఇంత మంచి ఆఫర్ ఎవరికీ రాదేమో. ఎందుకంటే.. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ గెలిచే అవకాశాన్ని కల్పించడం. సూపర్ ఓవర్ తొలి బంతిని థర్డ్ మ్యాన్ సైడు పంపించే క్రమంలో.. కెప్టెన్ జితేష్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బాల్ కే అశుతోష్ శర్మ కూడా ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 1 రన్ టార్గెట్ మాత్రమే ఉండిపోయింది. సూపర్ ఓవర్ ను సుయాష్ శర్మ బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ వై యాసిర్ అలి ప్రారంభించగా.. డకౌట్ అవటంతో మరింత డ్రామా నెలకొంది. ఆ తర్వాత వైడ్ వేయడంతో పరుగు కొట్టకుండానే బంగ్లా
గెలిచి ఫైనల్ కు వెళ్లింది.
