ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ : జితేందర్ రెడ్డి

ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న  పార్టీ బీజేపీ : జితేందర్ రెడ్డి

తాను టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను నారాయణపూర్ లో ఉంటే టీవీల్లో ప్రగతిభవన్ లో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. బీజేపీని వదిలి తాను ఎక్కడకు వెళ్లనని స్పష్టం చేశారు. ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ బీజేపీ అన్నారు. ఎంతమంది నేతలు పార్టీని వీడినా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 50వేల మెజార్టీతో గెలుస్తారని, బండి సంజయ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. 

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నేతలు పార్టీలు మారుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు. గతంలో వీరు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పని చేశారు.