
కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లాకు ఏడు నెలల తర్వాత గృహ నిర్భంధం నుంచి రిలీఫ్ లభించింది. తక్షణం ఆయనను రిలీజ్ చేయాలని జమ్ము కశ్మీర్ హోం శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేసిన సమయంలో కేంద్రం ఆయన్ని నిర్భందించింది. ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు ఆయన కుమారుడు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీలపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. వారి వల్ల శాంతిభద్రతలకు భంగం కలగకుండా కట్టడి చేసేందుకు గృహ నిర్భంధం చేసినట్లు పేర్కొంది.
అయితే కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. గతంలో దేశ భద్రతకు భంగం కలిగించినట్లు వారిపై ఎటువంటి కేసులు లేకుండా ఈ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించాయి. కాంగ్రెస్ సహా పలు పార్టీల అధినేతలు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని ఉమ్మడి స్టేట్‌మెంట్ ఇచ్చారు. గృహనిర్భందంలో ఉన్న ముగ్గురు మాజీ సీఎంలు ఫరూఖ్, ఒమర్, మెహబూబా ముఫ్తీలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఫరూఖ్ అబ్ధుల్లా గృహ నిర్భందంలో ఉన్నప్పటికీ లోక్‌సభతో కమ్యూనికేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన డిటెన్షన్ తర్వాత జరిగిన మూడు పార్లమెంట్ సెషన్స్‌కు ఆయన లీవ్ అప్లై చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5న ఈ ముగ్గురు మాజీ సీఎంలతో పాటు వందల మంది నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలను ప్రభుత్వం వారి ఇళ్లలో, కొన్ని స్టార్ హోటళ్లలో నిర్భంధించింది. వారిని విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది.