వారం రోజులుగా చీకట్లో జేఎన్టీయూ!

వారం రోజులుగా చీకట్లో జేఎన్టీయూ!

అంధకారంలో మగ్గుతున్న ఉద్యోగులు, సిబ్బంది

అన్నసాగర్ సబ్స్టేషన్‌‌‌‌లో ప్రాబ్లమ్

జనరేటర్తో వంతుల వారీగా 3 గంటల పాటు కరెంట్

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌ పూర్‌‌‌‌‌‌‌‌ జేఎన్టీయూ క్యాంపస్ వారం రోజులుగా చీకట్లో మగ్గుతున్నది. సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్‌ ను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తూ సహాయ పడుతున్న జేఎన్టీయూకే కరెంటు కష్టాలు రావడంపై అంతా అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌‌‌‌కు విద్యుత్ సరఫరా చేసే అన్నసాగర్ సబ్ స్టేషన్ వద్ద ఏర్పడిన టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ తో క్యాంపస్ స్టాఫ్, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వారం రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. క్యాం పస్ క్వార్టర్లలో దాదాపు 30 ఫ్యామిలీలు ఉంటున్నాయి . కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం క్లాసులు నడవకపోయినా ప్రిన్సిపాల్‌ తో పాటు ఫ్యాకల్టీలు, స్టాఫ్‌‌‌‌, సెక్యూరిటీ సిబ్బంది రోజువారీగా డ్యూటీలు చేస్తున్నా రు. వీరి ఇబ్బందులను చూడలేక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ తోపాటు ఫ్యాకల్టీ ఉండే క్వాటర్లలో జనరేటర్‌‌‌‌‌‌‌‌తో రోజుకు మూడు గంటల చొప్పున ఆంక్షలతో కూడిన కరెంట్‌‌‌‌ను అందిస్తూ అడ్జస్ట్ మెంట్ చేస్తున్నారు.

రోజుకు రూ.14 వేల ఖర్చు

కరెంట్‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా జేఎన్టీయూకు రోజుకు రూ.14 వేల ఖర్చు అవుతోంది. క్యాంపస్ లోని క్వార్టర్లలో 30 కుటుం బాలకు చెందిన సుమారు 90 మంది నివసిస్తున్నారు. కరెంటు లేకపోవడంతో వారం రోజుల నుంచి జనరేటర్ సాయంతో రోజు మూడు గంటలపాటు కరెంట్‌‌‌‌ తీసుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఉదయం పూట గంట రాత్రి రెండు గంటల చొప్పున కరెంటు వాడుకునే వెసులుబాటు కల్పించారు. దీనికి గాను నిర్వాహకులు రోజుకు రూ.14 వేల (200 లీటర్ల డీజిల్ కోసం) ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎప్పుడు వర్షం పడినా విద్యుత్ వైర్లకు చెట్లు అడ్డం తగిలినా సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కరెంటోళ్లకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

కరెంటు ఇచ్చి కష్టాలు

సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్‌ ను ఉత్పత్తి చేసే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కరెంట్‌‌‌‌ కష్టాలు తప్పడం లేదు. క్యాంపస్ పరిధిలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా రోజు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే సోలార్ లేదా నేరుగా కరెంటు వాడుకునే హక్కు జేఎన్టీయూకు లేదు. దీంతో ఉత్పత్తి అయిన విద్యుత్‌ ను నేరుగా అన్నసాగర్ సబ్ స్టేషన్‌ కు వెళ్తుంది. అక్కడి నుంచి తిరిగి జేఎన్టీయూకి సరఫరా చేస్తారు. అక్కడి సబ్ స్టేషన్ వద్ద ఏర్పడిన చిన్న టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ తో ప్రస్తుతం పూర్తిగా సరఫరా నిచిపోయింది. అయితే ప్రాబ్లమ్‌ ను క్లీయర్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన కరెంట్‌‌‌‌ ఆఫీసర్లు కాలేజీ నడవడం లేదన్న సాకుతో వారం రోజులుగా ఆ వైపునకు కూడా రాలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

కరెంటు సమస్య నిజమే..

ఈ విషయంపై జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బాలూనాయక్‌‌‌‌ను వివరణ కోరగా క్యాంపస్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇబ్బంది కాకుండా చూస్తున్నామని తెలిపారు. సమస్యను విద్యుత్ అధికారులు పరిష్కరించేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఆలస్యం అవుతుందన్నారు.