
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనతో అక్కడి విద్యార్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముసుగులు ధరించి కొందరు దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధులు కొందరు యూనివర్శిటిలో భద్రత లేదని అక్కడి నుంచి వెళుతున్నారు. సోమవారం ఉదయం యూనివర్శిటికి చెందిన ఓ విద్యార్ధిని క్యాంపస్ నుంచి వెళ్లిపోతూ… “బయటి వ్యక్తులు యూనివర్శిటిలోకి చొరబడి దాడి చేశారంటే.. ఇక్కడ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉందో చెప్పక్కర్లేదు. ఇంకా ఇక్కడే ఉండటం సేఫ్టీ కాదని ప్రస్తుతానికి క్యాంపస్ వదిలి వెళుతున్నానని” చెప్పింది.
ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు FIR రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడ్డ దుండగలను పట్టుకుంటామన్నారు. ఘటనలో గాయపడ్డ 34 మంది విద్యార్ధులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.