- దరఖాస్తులకు నెల రోజుల గడువు
- ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కులు, వెయిటేజీ ఆధారంగా ఎంపిక
హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,326 మంది డాక్టర్ల నియామకానికి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 15 నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ పోస్టులన్నింటికీ అర్హత ఎంబీబీఎస్. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ప్రభుత్వ దవాఖానాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్లకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉన్నందున దరఖాస్తులకు నెలరోజుల గడువు ఇచ్చామని బోర్డు వెల్లడించింది. మొత్తం పోస్టుల్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోనే 751 పోస్టులు ఉండగా.. టీచింగ్ హాస్పిటళ్లలో 357, వైద్య విధాన పరిషత్ పరిధిలో 211, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో 7 పోస్టులు ఉన్నాయి.
సెలెక్ట్ అయితే ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రైవేటు ప్రాక్టీసు చేసేందుకు అనర్హులని నోటిఫికేషనలోనే పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ ఏడాది జులై 1 నాటికి 44 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు పదేండ్లు ఇచ్చారు. ఎన్‌సీసీ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేండ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు(ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఇక పూర్తి అంధత్వం, మూగ, చెవిటి, బుద్ధిమాంద్యంతో బాధపడే వారు ఈ పోస్టులకు అనర్హులని నోటిఫికేషన్‌లో బోర్డు పేర్కొంది. అలాగే వేరే రాష్ట్ర అభ్యర్థులకు ఎలాంటి రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేసింది. ఉన్న పోస్టుల్లో 85 శాతం స్థానిక అభ్యర్థులకేనని
వెల్లడించింది.
ఎంపిక విధానమిలా..
ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కులు, వెయిటేజీ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 6 నెలల ఎక్స్‌పీరియన్స్‌కు 2.5 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో పనిజేస్తే ప్రతి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం 6 నెలలు పనిజేస్తేనే పాయింట్లు ఇస్తారు. అభ్యర్థులు ఈ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్‌ను తాము పని చేస్తున్న, గతంలో పని చేసిన ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి. ఇక దరఖాస్తు చేసే సమయంలోనే తమ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌ను కూడా అప్‌లోడ్ చేయాలని బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఎంబీబీఎస్‌లో వచ్చిన మార్కులు, వెయిటేజీ పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్టును మెడికల్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
