
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
ముంబై: మాజీ భార్యకు భరణం చెల్లించలేక ఓ వ్యక్తి దొంగతనాల బాట పట్టాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. నాగ్ పూర్ కు చెందిన 42 ఏండ్ల నిరుద్యోగి కన్హయ్య నారాయణ్ బౌరాషి ఇటీవల భార్యతో విడిపోయాడు. విడాకులు మంజూరు చేస్తూ మాజీ భార్యకు నెలనెలా రూ.6000 భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, ఉద్యోగం లేకపోవడంతో ఆ మొత్తం ఎలా చెల్లించాలో తెలియక దొంగతనాలు మొదలుపెట్టినట్లు కన్హయ్య చెప్పాడు. ఇటీవల 74 ఏండ్ల మహిళ జయశ్రీ జయకుమార్ గడే మెడలోని బంగారం గొలుసు చోరీకి గురైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వచ్చిన దొంగ ఆమె మెడలోని గొలుసును లాక్కొని పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, కన్హయ్యను అరెస్టు చేశారు. కన్హయ్యను విచారించగా చోరీ చేసింది తానేనని అంగీకరించాడు. మొదటి భార్యకు విడాకుల సందర్భంగా నెలనెలా ఆమెకు రూ.6 వేలు భరణం చెల్లించాల్సి ఉందని తెలిపాడు. ఉద్యోగం లేకపోవడంతో ఇలా చోరీలకు పాల్పడుతున్నానని ఒప్పుకున్నాడు.
ఇప్పటి వరకు నాలుగుసార్లు చోరీ చేసినట్టు చెప్పాడు. చోరీ చేసిన సొత్తును సమీపంలోని నగల వ్యాపారికి విక్రయించినట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడినికి కూడా అరెస్టు చేశారు.