
న్యూఢిల్లీ: దేశంలో లేబర్ మార్కెట్ కరోనా ముందు స్థాయిలకు చేరుకుందని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయని తెలిపింది. తగ్గిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు (ఎఫ్‌డీఐ) తిరిగి పుంజుకుంటాయని అంచనా వేస్తోంది. ఎకనామిక్ యాక్టివిటీ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో మెరుగ్గా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి క్వార్టర్‌లో కూడా స్ట్రాంగ్‌గా ఉంటుందని పేర్కొంది.
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌ఐఐ) ఇన్‌ఫ్లోస్ పెరగడంతో ఈ ఏడాది స్టాక్ మార్కెట్ కొత్త గరిష్టాలకు చేరుకుందని, దేశ ఆర్థిక వ్యవస్థపై డొమెస్టిక్, ఫారిన్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని హాఫ్ ఇయర్లీ ఎకనామిక్ రివ్యూలో ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ అంశాలు ఇబ్బంది పెట్టినా, దేశ ఎకానమీ 2023–24 లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో జీడీపీ గ్రోత్ రేట్ 7.7 శాతం పెరిగింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. గతంలో వేసిన 6.5 శాతం అంచనాను సవరించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న ఇన్‌ఫ్లేషన్ సమస్యలు, సప్లయ్ చెయిన్ సమస్యలు, జియో పొలిటికల్ టెన్షన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై నెగెటివ్ ప్రభావం చూపొచ్చని వెల్లడించింది.