ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు 

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు 

 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వాకం
  నామ్కేవాస్తే తనిఖీలతో సరిపెడుతున్న జేఎన్టీయూ ఆఫీసర్లు

ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పదేండ్ల నుంచి ఒకతను పనిచేస్తున్నాడు. జేఎన్టీయూ నుంచి బీటెక్ చేసినట్టు అతని బయోడేటాలో ఉంది. ఇది ఫేక్ సర్టిఫికెట్ అని అనుమానంతో కొందరు జేఎన్టీయూలో ఎంక్వైరీ చేయగా.. అతను ఆ వర్సిటీలో బీటెక్ చదవనేలేదని తేలింది. 

మేడ్చల్ లిమిట్స్ లోని ఓ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఓ వ్యక్తి ఐదేండ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతను చెన్నైలోని ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నప్పుడే.. కేరళలో ఎంటెక్ చదివినట్లు వర్సిటీకి రిపోర్టు ఇచ్చాడు. అతను గుర్తింపులేని యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాడనే ఆధారాలున్నాయి. పనిచేసే చోటు మారినప్పుడల్లా.. సర్టిఫికెట్స్ మారుస్తున్నట్టు ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి.
 
ఈ ఇద్దరే కాదు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నవాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. నిన్నమొన్నటి దాకా జేఎన్టీయూ పరిధిలో నకిలీ పీహెచ్డీ పట్టాలతో ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ల బాగోతాలు బయటపడగా ఇప్పుడు బీటెక్, ఎంటెక్ ఫేక్ సర్టిఫికెట్లతో ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ప్రైవేటు వర్సిటీల పేరుతో ఫేక్ పీహెచ్డీ పట్టాలు

జేఎన్టీయూలో పరిధిలో దాదాపు 250 వరకు ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. ఇందులో 80వేల మంది వరకు ఫ్యాకల్టీ రిజిస్టర్ కాగా, ప్రస్తుతం 40వేల మంది వరకు పనిచేస్తున్నారు. కాలేజీల గుర్తింపునకు రూల్స్ తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని ఏఐసీటీఈ పలుమార్లు హెచ్చరించడంతో పీహెచ్డీ హోల్డర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ఫ్యాకల్టీలు ఫేక్ పీహెచ్ డీ పట్టాలు తయారు చేయించుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు వర్సిటీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం జేఎన్టీయూ పరిధిలో దాదాపు 2,500 మంది వరకు పీహెచ్డీ హోల్డర్లున్నారు. వీరిలో ఫేక్ సర్టిఫికేట్లు భారీగానే ఉంటాయని యూనియన్ల నేతలు చెప్తున్నారు. జేఎన్టీయూ పరిధిలో డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల నుంచి పట్టాలు పొందిన 350 మంది వరకు ఉంటే, వారిలో 80 మంది వరకు ఫేక్ సర్టిఫికేట్లని తేల్చి, వారిని కిందటేడాది తొలగించారు. అయితే ఈ సమయంలో కొందిమంది ఎంక్వైరీలకు అటెండ్ కాకపోవడం గమనార్హం.

తనిఖీలు అంతంత మాత్రమే..

ఏటా కాలేజీలకు గుర్తింపు ఇచ్చే విషయంలో జేఎన్టీయూ ఫ్యాకల్టీ వివరాలనూ తనిఖీ చేయాలి. కానీ ఎంక్వైరీకి వెళ్లే ఆఫీసర్లు మాత్రం నామమాత్రంగానే ఫ్యాకల్టీ డేటాను పరిశీలించి వచ్చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న ఫ్యాకల్టీపై వర్సిటీ అధికారులకు కొందరు ఫిర్యాదులు చేసినా.. పెద్దగా చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి. తాజాగా కొన్ని ప్రొఫెషనల్ కాలేజీల్లో సిబ్బందికి సంబంధించిన బీటెక్ సర్టిఫికేట్లు కూడా ఫేక్ అని తేలడం గమనార్హం. ఎవరోఒకరి నుంచి ఫిర్యాదు అందేదాకా ఆ సర్టిఫికేట్లను వర్సిటీ అధికారులే రాటిఫై చేయడం వాళ్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఫిర్యాదులొచ్చినప్పుడు హడావుడిగా తనిఖీలు చేయడం, ఆ తర్వాత షరామామూలే అన్నట్లుగా వ్యవహరించడం ఆఫీసర్లకు కామన్ అయిపోయిందని పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా జేఎన్టీయూ ఆఫీసర్లు ఫేక్ పీహెచ్డీ, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లతో పనిచేస్తున్న వారిని గుర్తించి.. వారిపై, ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.