కొలువులు పెరుగుతున్నయ్

కొలువులు పెరుగుతున్నయ్
  • గత నెల ఆల్-టైమ్ హై  రిక్రూట్‌‌మెంట్లు వెల్లడించిన నౌకరీ జాబ్‌‌స్పీక్ రిపోర్టు

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్ నుంచి ఎకానమీ బయటపడుతుండటంతో జాబ్స్ రిక్రూట్‌‌మెంట్‌‌ ఊపందుకుందని జాబ్ పోర్టల్ ‘నౌకరీ’ వెల్లడించింది. ఈ ఏడాది జూలై నెల రిక్రూట్‌‌మెంట్లు ఆల్‌‌టైం హైకి చేరాయని ప్రకటించింది. నౌకరీ జాబ్‌‌స్పీక్ రిక్రూటింగ్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూలై లో రిక్రూట్‌‌మెంట్లు 11 శాతం పెరిగి ఆల్-టైమ్ హైకి చేరుకున్నాయి. కంపెనీలు దాదాపు 2,625 జాబ్స్ ఇచ్చాయి.  కిందటి ఏడాది జూలై తో పోలిస్తే ఈ ఏడాది జూలై లో మొత్తం రిక్రూట్‌‌మెంట్లు రెట్టింపు అయ్యాయి.  కరోనా మొదటి వేవ్‌‌తో పోలిస్తే సెకండ్‌‌ కోవిడ్ వేవ్ ఎఫెక్ట్‌‌ నుండి వ్యాపారాలు వేగంగా కోలుకుంటున్నాయి. 
ఐటీ ఉద్యోగాలకు మస్తు డిమాండ్  
అన్ని సెక్టార్లు డిజిటల్ కు మారుతుండటంతో ఐటీ- సాఫ్ట్‌‌వేర్‌‌/ సాఫ్ట్‌‌వేర్‌‌ సర్వీసుల్లో రిక్రూట్‌‌మెంట్లు మే నెలతో పోలిస్తే జూలై లో 18 శాతం పెరిగాయి. సీక్వెన్షియల్ గ్రోత్ జూన్‌‌లో 11 శాతం,  మేలో 14 శాతం రికార్డయింది.   కరోనా సమయంలో  తీవ్రంగా దెబ్బతిన్న రంగాలు కూడా ఇప్పుడు జోరుగా రిక్రూట్‌‌మెంట్లు నిర్వహిస్తున్నాయి.  ఐటీ హబ్స్‌‌గా పేరున్న సిటీల్లో జాబ్స్ భారీగా పెరుగుతున్నాయి.  ఈ ఏడాది జూలైలో బెంగళూరు ( 17 శాతం), హైదరాబాద్ ( 16 శాతం)  పూణే సిటీలు ( 13 శాతం) రెండంకెల ఎదుగుదలను సాధించాయి.  ఢిల్లీలో 13 శాతం,  ముంబై  లోనూ 10 శాతం జాబ్స్ పెరిగాయి. చెన్నై,  కోల్‌‌కతాలో రిక్రూట్‌‌మెంట్లు వరుసగా 10 శాతం  4 శాతం పెరిగాయి.   కోయంబత్తూరులో  24 శాతం,  జైపూర్ లో 11 శాతం జాబ్స్ పెరిగాయి.  అహ్మదాబాద్ లో మాత్రం ఇవి -3 శాతం తగ్గాయి. 
ఫ్రెషర్స్ కు వెల్కమ్
దాదాపు అన్ని ఎక్స్‌‌పీరియెన్స్‌‌ బ్యాండ్స్‌‌లో రిక్రూట్‌‌మెంట్లు బాగానే ఉన్నాయి. 0–-3 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్రెషర్స్ బ్యాండ్ లో రిక్రూట్‌‌మెంట్లు అత్యధికంగా 14 శాతం పెరిగాయి. ఈ విషయమై నౌకరీడాట్‌‌కామ్‌‌ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ “ఈ ఏడాది ఏప్రిల్,  మేనెలల్లో కంపెనీలకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. జూలై నుంచి మాత్రం రిక్రూట్‌‌మెంట్లు ఊపందుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో  రిక్రూట్‌‌మెంట్లు చాలా బాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్ల కంపెనీలు డిజిటలైజేషన్ వైపు వెళ్లడమే ఇందుకు కారణం”అని అన్నారు.