గద్వాల, వెలుగు : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణను వేగవంతం చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణ భూసేకరణపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తైతే పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేని చోట నిబంధనల ప్రకారం రైతులకు అవార్డు పాస్ చేయాలని సూచించారు.
మల్లమ్మ కుంటపై గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని, గుడ్డం దొడ్డి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 15 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినందున దానికి తగిన భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక సెషన్‌కు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఈనెల 24న జరగనున్న ఈ సమావేశంలో ఆయన ఉత్తమ నీటి నిర్వహణ విధానాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
