గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధిలో మహిళలు, మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచాలని, జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలకు చిన్నతనం నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే దోషులకు శిక్ష పడుతుందని, ప్రభుత్వ సేవలను వినియోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని, బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
