జాన్ పహాడ్ ఉర్సు షురూ.. వివిధ రాష్ట్రాల నుంచి వేలల్లో భక్తుల రాక

జాన్ పహాడ్ ఉర్సు షురూ..    వివిధ రాష్ట్రాల నుంచి వేలల్లో భక్తుల రాక
  • జనవరి 23న  గంధం ఊరేగింపులో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్  

పాలకవీడు, వెలుగు:  సర్వమత సమ్మేళనానికి ప్రతీకైన సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులు జరిగే ఉర్సులో భాగంగా తెల్లవారుజామున సైదులు బాబాను పెండ్లి కొడుకుగా అలంకరించారు. 

కొవ్వొత్తుల హారతులతో దర్గాలోని హజ్రత్ సయ్యద్ మొహనుద్దీన్ షా, జాన్ పాక్ షహిద్ రహమతుల్లా సమాధులపై పూజారి జానీ గంధం ఉంచి పూజలు ప్రారంభించారు. దర్గాలోని నాగేంద్రుడి పుట్టలో హిందువులతో పాటు ముస్లిం మహిళలు పాలు, గుడ్లు ఉంచి దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఫకీర్లు కవ్వాలి నిర్వహిస్తూ నృత్యాలు చేశారు. 

హైదరాబాద్ నుంచి తెప్పించిన పువ్వులు, ప్రత్యేక దట్టీలను కప్పి సైదులు బాబా సమాధులను అలంకరించారు. అనంతరం సైదులు బాబా అంగరక్షకుడైన సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా సిపాయికి చేశాకే  సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ. కుల, మతాలకు అతీతంగా జాన్ పహాడ్ ఉర్సుకు   వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 

శుక్రవారం గంధం ఊరేగింపు నిర్వహిస్తుండగా,  ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో 550 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్  గంధం ఊరేగింపులో పాల్గొంటారు.