భూభారతి చట్టంతో రైతులకు మేలు .. రైతులకు అవగాహన సదస్సుల్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

భూభారతి చట్టంతో  రైతులకు మేలు .. రైతులకు అవగాహన సదస్సుల్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
  • రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు
  • కొత్త చట్టంతో భూ సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్/ఆసిఫాబాద్/లక్సెట్టిపేట/లక్ష్మణచాంద, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలుపై ఉమ్మజి జిల్లాలోని కలెక్టర్లు రైతులు, ప్రజలకు అవగాహన కల్పించారు. భూభారతి చట్టం రైతులకు చుట్టంలా మారుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ నలంద ప్రియతో కలిసి పాల్గొని మాట్లాడారు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం భూ వివాదాలకు పరిష్కారం చూపుతుందని  పేర్కొన్నారు. వివాదాలకు తావు లేకుండా రైతుల భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ కొత్త చట్టాన్ని తెచ్చిందన్నారు. 

మండలానికి చెందిన వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు భూ సమస్యలపై 206 అప్లికేషన్లు సమర్పించారు. ఇందులో 120పైగా దరఖాస్తులు ఏళ్లుగా మోఖ మీద ఉండి పంట సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేనివే ఉన్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్, డీఏవో శ్రీధర్ స్వామి, మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లింబాజి, రైతులు పాల్గొన్నారు.
 
భూభారతితో రైతులకు మేలు 

భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంతో రైతులకు మేలు చేస్తుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆవరణలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో చీఫ్​గెస్ట్​గా పాల్గొని మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రికార్డుల్లో తప్పుల సవరణలకు ఆస్కారం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తిస్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయనున్నట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ చేస్తామన్నారు. గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో సరోజ తదితరులున్నారు.

భూ సమస్యలకు సత్వర పరిష్కారం

భూభారతి ఆర్​వోఆర్ చట్టంతో భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని  ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి కొత్త చట్టం ద్వారా హక్కులు, భూ సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, నిజమైన భూ యజమానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందన్నారు.

 భూ సమస్యల పరిష్కారంలో అప్పీల్ వ్యవస్థ ఉందని.. తహసీల్దార్ జారీ చేసిన ఆర్డర్​పై ఆర్డీవోకు, ఆర్డీవో జారీ చేసిన ఆర్డర్ పై కలెక్టర్​కు అప్పీలు చేసుకునే వెసులు బాటు తీసుకువచ్చిందని వివరించారు. కొనుగోలు, దానం, తనఖా, పాలు పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డుల్లో మార్పు చేసి పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేస్తారని.. ఈ ప్రక్రియ ఒకేరోజులో పూర్తయ్యే విధంగా చట్టంలో పొందుపరిచారని తెలిపారు. తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

భూభారతి చట్టంతో భూసమస్యలు పరిష్కారం

భూభారతి చట్టం అమలుతో ప్రజల భూసమస్య లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ మండలం న్యూ పోచంపాడు, మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి, నూతన ఆర్​వోఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో ప్రజల భూ సమస్యలు తలెత్తకుండా భూభారతితో చెక్​పెట్టవచ్చన్నారు. భూమి రిజిస్ట్రేషన్ అనంతరం లబ్ధిదారుడి పట్టా పాస్ బుక్‌లో భూ మ్యాపింగ్ నమోదవుతుందని తెలిపారు. భూకమతాలకు భూధార్ కార్డులు జారీ చేయనున్నట్టు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. 

మండలానికి చెందిన రైతుల నుంచి భూసంబంధిత ఫిర్యాదులు స్వీకరించి వాటిపై సమీక్షించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.