‘పోలవరం’ ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయండి : కేంద్ర జలశక్తి శాఖ

‘పోలవరం’ ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయండి : కేంద్ర జలశక్తి శాఖ
  • ఏపీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో తెలంగాణ భూభాగంలో తలెత్తే ముంపుపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేపట్టాలని ఏపీ వాటర్‌‌‌‌‌‌‌‌ రిసోర్సెస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ అన్నెపు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఈ మేరకు లేఖ రాశారు. ఈ నెల 13న పోలవరం ముంపుపై కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయాలంటూ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో తలెత్తే  ముంపుతో పాటు కిన్నెరసాని నది, ముర్రేడువాగులో నీళ్లు వెనక్కు తన్నే ప్రాంతాలపై సర్వే చేయాలని ఆ లెటర్​లో ఆదేశించారు.

ముంపు ప్రాంతాలపై జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేసేలా ఏపీకి ఆదేశాలివ్వాలని తెలంగాణ తమకు పలుమార్లు ఫిర్యాదు చేసిందని, ఈ విషయం ఇప్పటికే ఏపీకి తెలియజేసినా.. ఇంత వరకూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. జాయింట్‌‌‌‌‌‌‌‌ సర్వేపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, వెంటనే ఆ సమాచారం తమ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తెలియజేయాలని స్పష్టం చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌) లెవల్‌‌‌‌‌‌‌‌లో నీటిని నిల్వ చేస్తే తమ రాష్ట్రంలో ముంపుతో పాటు కిన్నెరసాని నది, ముర్రేడువాగులపై ప్రభావం పడుతుందని తమ సర్వేలో తేలిందని సీడబ్ల్యూసీకి  తెలంగాణ పలుమార్లు లేఖ రాసింది. పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే 892 ఎకరాలు ముంపుకు గురవుతాయని సర్వేలో తేలిందన్నారు. అలాగే భద్రాచలం పట్టణంలోని విస్టా కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌, కొత్తకాలనీ, రెడ్డిసత్రం, డంప్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలు నీట మునుగుతాయని పేర్కొన్నారు.