రీజినల్​ ఓటీటీలదే హవా

రీజినల్​ ఓటీటీలదే హవా

వెలుగు బిజినెస్​ డెస్క్​ : మన పాత అలవాట్లలో చాలా వాటిని కరోనా మహమ్మారి మార్చేసింది. అలా మార్చేసిన వాటిలో మనం సినిమాలు చూసే విధానం కూడా ఉంది. సినిమాలకి రెగ్యులర్​గా వెళ్లేవాళ్లకి ఇప్పుడు ఓటీటీ (ఓవర్​ ది టాప్​)లే సినిమా థియేటర్లుగా మారిపోయాయి. సినిమాలు చూడటానికి ఇప్పుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరమే లేదు. మహా అయితే మనింట్లో మనం కూర్చున్న ఒక రూమ్​ నుంచి ఇంకో రూమ్​కి వెళ్లాల్సి ఉంటుంది, అంతే. ఇక మొబైల్​లో ఓటీటీనైతే....ఎక్కడైనా....ఎప్పుడైనా చూసేయొచ్చు. సినిమాలు చూసే వాళ్ల ఇష్టాలకి అనుగుణంగానే కంటెంట్​ కూడా మారుతోంది. ప్రస్తుతం ఓటీటీ స్టార్లు పాపులర్ అవుతున్నారు. హీరోయిన్​లే కథలో ఇంపార్టెంట్​ రోల్స్​ ప్లే చేసే సినిమాలూ ఇప్పుడు ఎక్కువయ్యాయి. గతంతో పోలిస్తే సినిమాల నిడివి తగ్గిపోయింది. కొంతమందయితే  కొన్ని షార్ట్​ ఫిల్మ్​లను కలిపేసి కలెక్షన్​గానూ తెస్తున్నారు. ప్రస్తుతం వెబ్​ సిరీస్​ హాట్ ట్రెండ్‌గా నడుస్తోంది. అవే ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. అంతమాత్రాన పాత ఫార్మాట్​ సినిమాలు కనిపించకుండా పోతున్నాయని కాదు. వాటి ప్లేస్​ వాటిదే. కరోనా మహమ్మారి రాకతో 2020 లో ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ ఊపందుకున్నాయి. ఆ ఏడాది మల్టీప్లెక్స్​లు, సినిమా హాళ్లు చాలా వరకు మూసివేసే ఉన్నాయి. ఇళ్లకే పరిమితమైన ఆడియెన్స్​ ఎంటర్​టెయిన్​మెంట్​ కోసం డిజిటల్​ స్క్రీన్స్​పైనే ఆధారపడ్డారు. అప్పటిదాకా అందుబాటులో ఉన్న  హిందీ, ఇంగ్లీష్​ కంటెంట్​ను చూడటం మొదలెట్టారు.
రీజినల్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ..
 ఇదే టైములో తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతి వంటి రీజినల్​ కంటెంట్​పై ఇంటరెస్ట్​ విపరీతంగా పెరిగింది. దీంతో చాలా రీజినల్​ ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ పుట్టుకొచ్చాయి. ఓహో గుజరాతి (గుజరాతి), హోయిచోయి (బెంగాలి), సన్​  నెక్స్ట్​​ (దక్షిణాది రాష్ట్రాలు), ఆహా (తెలుగు) వంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ ఆడియన్స్​ దగ్గర పాపులారిటీ సంపాదించుకోవడంలో ఎక్కువగా సక్సెసయ్యాయి. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వీడియో, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వంటి పెద్ద ప్లేయర్లతో ఈ రీజినల్​ ఓటీటీలు గట్టిగానే పోటీపడుతున్నాయి. స్కామ్​ 1992 వెబ్​ సిరీస్​తో ప్రతీక్​ గాంధి పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నానుతోంది. ఫ్రెష్​గా ఉండటంతోపాటు, కొత్తగా ఉంటుండడంతో రీజినల్​ స్టోరీస్​కు పాపులారిటీ ఎక్కువగా వస్తోందని ప్రతీక్​ గాంధి చెబుతున్నారు. ఇప్పుడు రిజినలే కొత్త గ్లోబల్‌ అని అన్నారాయన. మనం ఇక్కడ స్పానిష్​ కంటెంట్​ చూస్తున్నాం, అలాగే ఆ దేశంలో మన తెలుగు, గుజరాతి కంటెంట్​ను చూస్తూ ఉండి ఉండొచ్చని చెప్పారు. రీజినల్​ స్టోరీలన్నీ కంటెంట్​ ఆధారంగా నడుస్తున్నాయని, స్టార్ల వల్ల కాదని కూడా పేర్కొన్నారు. తాజాగా మలయాళంలో వచ్చిన జోజి బాగుందని గాంధి పేర్కొన్నారు. 
రీజినల్‌ కంటెంట్‌కు గిరాకీ
రీజినల్​ కంటెంట్​కు ఆడియెన్స్​ పెరుగుతున్న నేపథ్యంలో తమ కంటెంట్​ ఆఫరింగ్స్​నూ ఎక్కువ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​. అమెజాన్​ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్​లు కూడా రీజినల్​ కంటెంట్​పై ఫోకస్​ పెడుతున్నాయి. సన్​ నెక్స్ట్​ వద్ద ఏకంగా 4 వేల సౌత్​ ఇండియన్​ సినిమాల లైబ్రరీనే ఉంది. హోయిచోయి బెంగాలిలో ఇప్పటికే 80 షోలను రిలీజ్​ చేసింది. మరో 20 షోలు, డజను సినిమాలు పైప్‌లైన్‌​లో ఉన్నాయని చెబుతోంది. గుజరాతిలో ప్రీమియం కంటెంట్​ ఆఫర్​ చేసేందుకు ఓహో గుజరాతిని ఫిల్మ్​ మేకర్​ అభిషేక్​ జైన్​ తెచ్చారు. స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​కు టైర్​ 2, టైర్​ 3 సిటీల నుంచే ఇటీవల ఎక్కువ మంది ఆడియెన్స్​ వస్తున్నారు. రీజినల్​ కంటెంట్​ బూమ్​కు ఇది కూడా ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. 2017లో మొదలైన బెంగాలి ఓటీటీ హోయిచోయి 13 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను, లాంచైన ఏడాదిలోపే  తెలుగు ఓటీటీ ఆహా 10 లక్షల మంది పెయిడ్​ సబ్​స్క్రయిబర్లను తెచ్చుకోగలిగాయి. చిన్న సిటీలలోని ప్రజలు రీజినల్ కంటెంటెకు ఈజీగా కనెక్ట్​ అవుతుండటమే ఓటీటీల సక్సెస్‌కి కారణం.