జోషిమఠ్‌లో 12రోజుల్లోనే 5.4 సెం.మీ కుంగిన నేల

జోషిమఠ్‌లో 12రోజుల్లోనే 5.4 సెం.మీ కుంగిన నేల

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన జోషిమఠ్ లో భూమి క్షీణత వివాదం చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ కేవలం 12రోజుల్లోనే 5.4 సెం.మీ నేల కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా షేర్ చేసింది. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిలీజ్ చేసిన ఈ చిత్రాలు డిసెంబర్ 27 నుంచి జనవరి 8 మధ్య రోజులకు చెందినవిగా తెలిపింది. అయితే జోషిమఠ్ కేంద్రంగా ఉన్న ఆర్మీ హెలిప్యాడ్, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలో అధిక మొత్తంలో మట్టిని తవ్వడంతో.. జోషిమత్-- ఔలీ రహదారికి సమీపంలో 2,180మీటర్ల ఎత్తులో ఈ క్షీణత ప్రభావం అధికంగా ఉందని ఇస్రో వెల్లడించింది.
 
అంతకుముందు కొన్ని నెలల క్రితమే జోషిమఠ్ మునిగిపోయే ప్రమాదం ఉందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. గతేడాది ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో ఇక్కడ 9 సెంటీమీటర్ల మేర మునిగిపోయింది వెల్లడించింది. బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రం ఉన్న పట్ణణంలో ఆలయాలు, భవనాలు, రోడ్లు పగుళ్లు ఏర్పడి విపత్తు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఇప్పటికే దాదాపు 4వేల మందిని సహాయక శిబిరాలకు అధికారులు తరలించారు. కాగా ఇటీవలే హోటళ్లు, వ్యాపార సంస్థలతో పాటు 678 గృహాలు ప్రమాదంలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కొండచరియలు విరిగిపడడంతో అక్కడి భూమి క్షీణతకు గురవుతోందని ప్రాథమికంగా వెల్లడించింది. అయితే ఇటీవలే ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ బాధిత కుటుంబాలను కలిసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ప్రతి బాధిత కుటుంబానికి ₹ 1.5 లక్షలు ఇస్తామన్న ఆయన.. ఇది తాత్కాలిక చర్యేనని..  నష్టపరిహారానికి సంబంధించిన విషయంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.