కరోనాతో పోరులో జర్నలిస్టులు బలి

కరోనాతో పోరులో జర్నలిస్టులు బలి

హైదరాబాద్​, వెలుగు: డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను కరోనా వారియర్లు అని పిలుస్తున్నాం. జర్నలిస్టులూ అందుకు తక్కువేం కాదు. కరోనా టెస్టింగ్​ సెంటర్లు, దవాఖానలు, శ్మశాన వాటికల్లో పరిస్థితులను జనం ముందుంచుతూ వారియర్లుగా ముందుండి పనిచేస్తున్నారు. కరోనాతో పాటు ఎన్నికల ప్రచార సభలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వార్తలు, సొసైటీలో జరిగే సంఘటలను ఎప్పటికప్పుడు జనం ముందుంచుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది జర్నలిస్టులు దాని బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆధారం కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం అంతంత మాత్రమే. 
యువ జర్నలిస్టులూ..
సెకండ్​ వేవ్​లో ఇప్పటిదాకా 24 మంది జర్నలిస్టులు డ్యూటీలో భాగంగా కరోనా బారిన పడి చనిపోయారు. అందులో ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువ జర్నలిస్టులే ఉండడం ఆందోళన కలిగించే విషయం. చనిపోయిన వారిలో చాలా మందికి ఇంకా చిన్న పిల్లలు, వారి మీద ఆధారపడి బతికే తల్లిదండ్రులుండడం మరింత ఆవేదనకు గురిచేసే విషయం. కరోనాతో పోరులో ఆ మహమ్మారికి మొట్టమొదటగా బలైపోయింది మనోజ్​కుమార్​ అనే యువ జర్నలిస్ట్​. నిరుడు జూన్​ 7న ఆయన కరోనాతో చనిపోయారు. ఫస్ట్​వేవ్​లో మొత్తంగా రెండు వేల మందికిపైగా జర్నలిస్టులు కరోనా బారిన పడగా 10 మంది చనిపోయారు. అయితే, అందులో 1,640 మంది జర్నలిస్టులే తెలంగాణ ప్రెస్​ అకాడమీలో రిజిస్టర్​ చేసుకున్నారు. చనిపోయిన వారిలో ఐదుగురికే ప్రెస్​ అకాడమీలో సభ్యత్వం ఉంది. సెకండ్​వేవ్​లోనూ వెయ్యి మందికిపైగా కరోనా బారిన పడినా.. 400 మంది వరకే ప్రెస్​ అకాడమీలో రిజిస్టర్​ చేసుకున్నోళ్లున్నారని అకాడమీ మేనేజర్​ జి. లక్ష్మణ్​ కుమార్​ తెలిపారు. ఫస్ట్​వేవ్​లో కరోనా బారినపడిన వారికి రూ.20 వేలు, చనిపోయిన వారికి రూ.లక్ష చొప్పున సాయం చేసినట్టు ప్రెస్​ అకాడమీ కార్యదర్శి అలీ ముర్తుజా తెలిపారు.  
హెల్త్​ కార్డ్​ పనిచేయట్లే
కరోనా సోకిన చాలా మంది జర్నలిస్టులకు ట్రీట్​మెంట్​ చేయించుకునే స్థోమత కూడా లేదు. కొందరు జర్నలిస్టులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నా.. ఇంకొందరికి బెడ్లు దొరకని పరిస్థితి. అక్రెడిటేషన్​ ఉన్నోళ్లకు హెల్త్​కార్డులున్నా అవి కరోనా ట్రీట్​మెంట్​కు ఎందుకూ పనికిరావడం లేదు. దీంతో కొందరు జర్నలిస్టులు బయటి నుంచి లక్షల్లో అప్పులు తెచ్చి ట్రీట్​మెంట్​ చేయించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. కొన్ని రాష్ట్రాలు జర్నలిస్టుల ట్రీట్​మెంట్​ కోసం ప్రత్యేక సౌలతులు కల్పించాయి. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నాయి. కానీ, ఇక్కడ ఆ ఊసే లేదు. అయితే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల వరకు సాయం చేసేందుకు ఇటీవలే సర్కార్​ ముందుకు వచ్చింది. డ్యూటీలో భాగంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారని, జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని ప్రెస్​ అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ సూచించారు. జర్నలిస్టుల బాగు కోసం మీడియా అకాడమీ చేయాల్సినదంతా చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు కూడా జర్నలిస్టుల మరణాలపై స్పందించారు. మహమ్మారికి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేస్తోందని, అక్షర యోధులకు జోహార్లని ఆయన ట్వీట్​ చేశారు. 

సెకండ్​వేవ్​లో ఇప్పటిదాకా చనిపోయిన జర్నలిస్టులు 
    కె. అమర్​నాథ్​, 
సీనియర్​​ జర్నలిస్టు, హైదరాబాద్​​
    జయప్రకాశ్​, కరీంనగర్​​
    శ్రీనివాస్​, యాచారం (రంగారెడ్డి)
    జిందంవార్​ సాయినాథ్​, 
భైంసా, నిర్మల్​
    డి. అశోక్​, నిజామాబాద్​​
    బూర రమేశ్​, వేములవాడ, సిరిసిల్ల
    పడకంటి రమేశ్​, కరీంనగర్​​
    చింతా నాగరాజు, సిద్దిపేట
    రామచంద్రరావు, హైదరాబాద్​​
    కల్పన, హైదరాబాద్​​
    కొండ్ర శ్రీనివాస్​, మంచిర్యాల
    షాబాజ్​ పాషా, కొడంగల్​​
    వేణుగోపాల్​, డిచ్​పల్లి
    శేఖర్​, దర్పల్లి
    గిరి, షాద్​నగర్​​
    రంజాన్​ అలీ, కరీంనగర్​​
    కుమారస్వామి, కరీంనగర్​​
    దామెర శేషగిరిరావు, 
మేళ్ల చెరువు, సూర్యాపేట
    ధర్మాసనం శ్రీధర్​, హైదరాబాద్​​​
    చీర్ల సమ్మిరెడ్డి, మంచిర్యాల
    శోభన్​బాబు, తల్లంపాడు (ఖమ్మం)
    రాచర్ల రాజేశ్వర్​, ఆర్మూర్​
    జ్ఞానేశ్వర్​, ఆర్మూర్, నిజామాబాద్​​
    కాసం గోపికృష్ణ, మేడ్చల్​


రూ.6 లక్షలు అప్పు తెచ్చి కట్టినా బతకలే
మా నాన్నకు 15 రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరం రావడంతో నిజామాబాద్​ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కరోనా పాజిటివ్​ అని తేలింది. మంచి వైద్యం కోసం హైదరాబాద్​కు తీసుకెళ్లాం. 6 రోజుల్లోనే నాన్న చనిపోయారు. ట్రీట్​మెంట్​ కోసం రూ.6 లక్షలు అప్పు చేసినా మా నాన్న బతకలే.   - నిఖిల్​, సాయినాథ్​ పెద్ద కుమారుడు
ఎట్ల బతుకుడో అర్థమైతలేదు
మాది పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఆయన జాబ్​ మీదనే కష్టంగా బతుకుతున్నం. నా భర్తను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించినం. హాస్పిటల్​కు అయిన రూ.4 లక్షల బిల్లును అప్పులు చేసి కట్టినం. మాకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. నేను ప్రైవేట్​ స్కూల్​లో టీచర్​గా పనిచేసిన. నిరుటి నుంచి స్కూళ్లు నడవక ఆ జాబ్​ కూడా పోయింది. ఇద్దరు పిల్లలతో ఎట్ల బతకాల్నో అర్థమైతలేదు.  - కొండ్ర స్వప్న, శ్రీనివాస్​ భార్య