ప్రముఖులపై బీజేపీ గురి

ప్రముఖులపై బీజేపీ గురి

తెలంగాణ పై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ పై కూడా గురి పెడుతోంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన  కేంద్రమంత్రి అమిత్ షా .. స్టార్ హీరో ఎన్టీఆర్ తో  భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది. ఈ చర్చ కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

వరంగల్ పర్యటన కోసం తెలంగాణకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... సినీ హీరో నితిన్ తో సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో సమావేశం కానున్నారు. నితిన్ తో పాటుగా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌, పలువురు రచయితలు, ఇతర క్రీడాకారులతో కూడా నడ్డా భేటీ కానున్నట్లుగా సమాచారం. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా పాల్గొని...  రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 

అనంతరం ఆయన నితిన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీ హీరోతో జాతీయ పార్టీ అధ్యక్షుడు సమావేశం అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.