కొనసాగిన జూడాల సమ్మె

కొనసాగిన జూడాల సమ్మె
  • ఎమర్జెన్సీ సహా వైద్య సేవలన్నీ బహిష్కరణ
  • ఆమరణ నిరాహార దీక్ష విరమణ.. రిలే దీక్షగా కొనసాగింపు
  • ఆందోళనలు విరమించండి:కేంద్ర మంత్రి హర్షవర్ధన్
  • మా డిమాండ్లు పరిష్కారం కాలేదు: ఐఎంఏ

హైదరాబాద్, వెలుగు/న్యూఢిల్లీ:నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. రెండో రోజైన శుక్రవారం.. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ సహా అన్ని రకాల సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. ఆదిలాబాద్‌‌‌‌ రిమ్స్‌‌‌‌ మొదలుకొని, హైదరాబాద్‌‌‌‌లోని ఉస్మానియా వరకు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో గురువారం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు. దాన్ని రిలే నిరాహార దీక్షగా మార్చుకున్నామని జూడాల అసోసియేషన్ సలహాదారు, డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ తెలిపారు. రోజంతా వాన పడటం, డాక్టర్ల సమ్మెపై ముందు నుంచే మీడియాలో వార్తలు రావడంతో ఓపీకి వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గింది. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. నిమ్స్‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ వెల్‌‌‌‌నెస్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌కు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌కు రెసిడెంట్ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఎన్‌‌‌‌ఎంసీ బిల్లులో తాము కోరిన సవరణలు చేసేలా కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఎమర్జెన్సీ సేవల బహిష్కరణపై భిన్నాభిప్రాయాలు

సమ్మెపై జూడాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించే విషయంలో కొంతమంది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జూడాలు చెబుతున్నారు. ఆమరణ దీక్ష విషయంలోనూ ఇలాగే తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఆమరణ దీక్షను, శుక్రవారం రిలే నిరాహార దీక్షగా మార్చుకోవాల్సి వచ్చిందంటున్నారు. కాగా, ఎన్‌‌‌‌ఎంసీ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న రెసిడెంట్ డాక్టర్స్‌‌‌‌.. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం అటెండ్ అవుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎయిమ్స్‌‌‌‌ రెసిడెంట్ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్ నిర్ణయం మేరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించినట్టు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మా ప్రధాన డిమాండ్లు పరిష్కరించలేదు: ఐఎంఏ

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లకు తమ మద్దతు కొనసాగుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. తమ ప్రధాన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పింది. అర్హత లేని నాన్ మెడికల్ వ్యక్తులు మెడిసిన్ ప్రాక్టీసు చేసుకునేందుకు అనుమతివ్వడాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేసింది. ‘‘ఐఎంఏ ఎంఎస్ఎన్ (మెడికల్ స్టూడెంట్ల నెట్​వర్క్)కు చెందిన స్టూడెంట్లు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరాహార దీక్షలు, రాజ్​భవన్ మార్చ్​లు జరుగుతున్నాయి” అని వివరించింది. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆపేయడంతో చాలాచోట్ల రోగులు ఇబ్బందులుపడ్డారు.

విధుల్లోకి రండి: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కోరారు. డాక్టర్లు, పేషెంట్లు, మెడికల్ స్టూడెంట్లు, సొసైటీని దృష్టిలో ఉంచుకునే ఎన్ఎంసీ చట్టం తీసుకొచ్చినట్లు  చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆస్పత్రులతోపాటు, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్ఎంసీ బిల్లుకు సంబంధించిన డాక్టర్లు లేవనెత్తిన సందేహాలను తాను క్లారిఫై చేసినట్లు చెప్పారు. బిల్లును అర్థం చేసుకోలేని వారందరికీ త్వరలోనే దాని గొప్పదనం తెలుస్తుందని అన్నారు.