జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా అన్ని చోట్ల ఓటింగ్ కొనసాగుతోంది. రాజకీయ ,సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి రెండుగంటల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 10.2 శాతమే పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు.షేక్ పేటలో లంకల దీపక్ రెడ్డి, యూసఫ్ గూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు.
ALSO READ : జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు.
ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది. కాంగ్రెస్ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
