
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడ్తామంటున్న ఆ పార్టీ పెద్దలకు.. ఇది కీలకంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడం, రాంచందర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొన్నటిదాకా సడీసప్పుడు లేని ఆ పార్టీ ఇటీవలే అభ్యర్థి ఎంపికపై దృష్టిపెట్టింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత కోమల ఆంజనేయులు ఉన్నారు. కాగా, జూబ్లీహిల్స్ నుంచి దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ తదితరులు పోటీకి ఆసక్తిచూపుతున్నారు.
వీరితో పాటు సినీ నటి జయసుధ పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిలో కేడర్ మద్దతు ఎవరికి ఉందో త్రిమెన్ కమిటీ తేల్చి హైకమాండ్‌కు నివేదించనుంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండడంతో నగరంలోని కేడర్ అంతా జూబ్లీహిల్స్ ఎన్నికలకు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశించింది. ఈ క్రమంలోనే పార్టీ కార్పొరేటర్లంతా ఇక్కడ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
హడావుడి మొదలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ విజయం కోసం వ్యూహరచనలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయనే కాంగ్రెస్ ధీమాతో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటూ గెలవని ఆ పార్టీ.. ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో బోణీ కొట్టింది.
అదే జోష్‌తో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోనూ విజయం సాధించాలని భావిస్తున్నది. అటు వరుస ఓటములతో కుదేలైన బీఆర్ఎస్కు ఈ సిట్టింగ్స్థానాన్ని తప్పక నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి! దీంతో ఆ పార్టీ ప్రధానంగా సెంటిమెంట్‌నే నమ్ముకున్నది. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటులో ఆయన భార్య సునీతనే అభ్యర్థిగా ప్రకటించి, ప్రచారం చేస్తున్నది. మరోవైపు కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్తున్న బీజేపీకి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షలా మారింది.