సొంతచెల్లెకే అన్యాయం చేసిండు ..బోరబండ రోడ్ షో లో సీఎం రేవంత్.

సొంతచెల్లెకే అన్యాయం చేసిండు ..బోరబండ రోడ్ షో లో   సీఎం రేవంత్.
  • కేటీఆర్​పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్​
  • ఏ ఆడబిడ్డయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు
  • కానీ, కవిత బయటకొచ్చి ఏడుస్తున్నదంటే కేటీఆర్​ ఎంత కష్టపెట్టిండో..!
  • పక్కన కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్
  • పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తడా?
  • పీజేఆర్​ కుటుంబాన్ని ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్​
  • మొదటి టర్మ్​లో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు
  • అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది?
  • కిషన్ రెడ్డీ..! గల్లీలో తిరుగుడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకురా 
  • బోరబండ చౌరస్తాకు పీజేఆర్​ పేరు పెడ్తామని, విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మహిళా సెంటిమెంట్​తో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీకి మహిళలే తగిన బుద్ధిచెప్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఆడబిడ్డ మాగంటి సునీతను గెలిపించాలని కేటీఆర్ అంటున్నడు. సొంత చెల్లెకు ఆస్తులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టిన నీచుడు ఈ కేటీఆర్!  సొంత చెల్లెకు అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తానంటే ఎవరైనా నమ్ముతరా?’’ అని ఆయన ప్రశ్నించారు.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో సీఎం రేవంత్​ మాట్లాడారు. ఆడబిడ్డల బాగోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. బీఆర్​ఎస్​ నేతలు చెప్పే కల్లిబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. అలాంటి స్కీమ్​ను  రద్దు చేయాలని బీఆర్ఎస్సోళ్లు మాట్లాడుతున్నారని, ఇది వారి గలీజు బుద్ధికి నిదర్శనమని  మండిపడ్డారు. 

పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్

2007 లో పీజేఆర్ చనిపోతే ఆయన కుటుంబంపై పోటీకి టీడీపీ దూరంగా ఉంటే, బీఆర్ఎస్ తరఫున ఇక్కడ పోటీకి దించి ఆ ఇంటి ఆడబిడ్డలకు అన్యాయం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని సీఎం రేవంత్  ఫైర్​ అయ్యారు. ‘‘నాడు ఏకగ్రీవం కోసం కేసీఆర్ ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన పీజేఆర్ కుటుంబ సభ్యులకు కనీసం అపాయింట్‌‌మెంట్ కూడా ఇవ్వలేదు.. ఎర్రటి ఎండలో గేటు బయటే మూడు గంటల పాటు నిలబెట్టిండు. 

ఎవరైనా ఎమ్మెల్యే  చనిపోతే ఆ కుటుంబంపై పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే గొప్ప సంప్రదాయం ఉండేది. దాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్​ కాదా? ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం మహిళల సెంటిమెంట్ తో బీఆర్ఎస్ నేతలు జనం ముందుకు వస్తున్నరు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు” అని తెలిపారు. 

2014  నుంచి ఐదేండ్ల పాటు ఆడబిడ్డలకు మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్​కు ఇప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సంక్షేమం కోసం ఉచిత బస్సు సౌకర్యం,

రూ. 500కే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​, 67 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖకు మంత్రి పదవులు ఇచ్చి మహిళలను గౌరవించామని  పేర్కొన్నారు. 

బీజేపీ, బీఆర్​ఎస్​ది ఫెవీకాల్​ బంధం

కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలనేది ఆ రెండు పార్టీల లోపాయికారి ఒప్పందమని, అందులో భాగంగానే బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో 8  చోట్ల డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 

ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్  కోసం  బీజేపీ డిపాజిట్ ను కూడా కోల్పోయేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవీకాల్ బంధం. మొన్న కేటీఆర్ మాట్లాడిందే.. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఈ ఇద్దరికి ఫామ్​హౌస్ లో కూర్చొని కేసీఆర్ ఆదేశాలు ఇస్తున్నడు” అని విమర్శించారు. ఇక్కడ ఎంపీగా బీజేపీకి, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కు మూడుసార్లు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి ఏమిటో తాను చూపిస్తానని ప్రజలను సీఎం రేవంత్​ కోరారు.  

‘‘మీ ప్రాంతంలో పుట్టిపెరిగిన నవీన్ యాదవ్ ను గెలిపించండి. మంత్రిగా అజారుద్దీన్, ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ మీకోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం ఇద్దరూ పనిచేస్తరు. నవీన్ యాదవ్ ను ఆశీర్వదిస్తే మీ ప్రాంతంలో వందల కోట్లతో అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంట” అని తెలిపారు. 

జూబ్లీహిల్స్​కు వాళ్లు చేసిందేంది?

పదేండ్ల పాటు కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి జూబ్లీహిల్స్ ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఇప్పుడు తాడు, బొంగురం లేనోళ్లు ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్తున్నరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని వాళ్లు ఎందుకు అభివృద్ధి చేయలేదోచెప్పాలి?” అని ప్రశ్నించారు. 

‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్  గల్లీల్లో తిరుగుతూ ఏదేదో మాట్లాడుతున్నడు. ముందుగా ఆయన ఢిల్లీ నుంచి నిధులు తీసుకు వచ్చి.. ఆ తర్వాత గల్లీల్లో మాట్లాడాలి. కేంద్రం నుంచి పది పైసలు తీసుకురాకుండా ఇక్కడ మాట్లాడడం ఏమిటి?” అని సీఎం నిలదీశారు

ఈ దుర్మార్గులు చేసిన మోసం, అన్యాయంపై సొంత చెల్లె (కవిత) ఇప్పుడు ఇల్లిల్లూ తిరుగుతూ కంటతడిపెడుతున్నది. నిన్నగాక మొన్న ఆమె మా మహబూబ్ నగర్​కు వచ్చి ఏడ్చింది. ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు. ఎంత బాధ ఉన్నా తనలోనే దిగమింగుకొని పుట్టింటి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ దుర్మార్గులు ఆ ఆడబిడ్డను ఎంత కష్టపెట్టి ఉంటరో ఆలోచించండి. అందుకే ఆమె బయటకు వచ్చి వీళ్ల బాగోతం చెప్తున్నది. తండ్రిని అడ్డంపెట్టుకొని వేలకోట్లు సంపాదించుకున్న దుర్మార్గులు వీళ్లనీ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నది.

బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు

బోరబండ చౌరస్తాకు 'పీజేఆర్ చౌరస్తాగా పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారని.. పేరు ఒక్కటే కాదు, ఇక్కడ ఆయన విగ్రహం కూడా పెట్టిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. "నవీన్ యాదవ్ విజయోత్సవ సభను ఇక్కడే జరుపుకుందాం. అప్పుడు నేనూ వస్తాను" అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్, అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి తదితరులు ఉన్నారు.