
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గత 30 ఏళ్లుగా ఉన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కృష్ణానగర్ నాలా సమస్య కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వారం పదిరోజుల్లో పూర్తి స్థాయిలో వరద సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
శుక్రవారం (ఆగస్టు 08) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్.. కృష్ణానగర్, రెహమత్ నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా పనులు రెండు మూడు రోజుల్లో మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అందుకోసం స్థానికులు సహకరించాలని కోరారు.
ఇటీవల మంత్రుల పర్యటనలో భాగంగా వరద సమస్యలను నోట్ చేసుకున్నామని.. ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మొత్తం 65 లక్షలతో పనులకు సంబంధించిన బడ్జెట్ సాంక్షన్ అయిందని చెప్పిన మంత్రి... టెక్నికల్ ప్రాసెస్ జరుగుతుందని అన్నారు.
►ALSO READ | థియేటర్ ప్రేమికులకు డబుల్ ధమాకా.. శనివారం (ఆగస్టు 09) హైదరాబాద్లో రెండు ఫేమస్ షో లు.. డీటెయిల్స్ ఇవే !
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ నాలాలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. హైడ్రా , ghmc అధికారులు, drf సిబ్బంది ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేస్తున్నారని తెలిపారు.
భవిష్యత్ లో సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం తరపున కృష్ణానగర్ వాసులకు హామీ ఇస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. వర్షం కురిసిన తరువాత 24 గంటల పాటు వరద నిలిస్తే తమ దృష్టి కి తీసుకురావాలని.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.