సెప్టెంబర్ 30న జూబ్లీహిల్స్ ఓటరు ఫైనల్ లిస్ట్

సెప్టెంబర్ 30న జూబ్లీహిల్స్ ఓటరు ఫైనల్ లిస్ట్
  • 2 నుంచి 17 వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌‌‌‌ను విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌‌‌‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది జులై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ స్వీకరించి, 25 వరకు పరిష్కరిస్తామన్నారు. 30న ఓటరు తుది జాబితా విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ నుంచి రాజేశ్​ కుమార్, బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, బీఎస్​పీ సందేశ్ కుమార్, ఆమ్ ఆద్మీ విజయ్, సీపీఎంశ్రీనివాసరావు, టీడీపీ ప్రశాంత్ రాజు, ఎంఐఎం నుంచి సయ్యద్ ముస్తాక్ పాల్గొన్నారు.