మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్

మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్
  • రంగంలోకి దిగిన రెండు జాతీయ పార్టీలు
  • కాంగ్రెస్ నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి బస్తీబాట
  • బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గల్లీ పర్యటన
  • అభ్యర్థిని ఖరారు చేశాక ప్రచారం స్టార్ట్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్
  • మూడు పార్టీలకు సవాల్ గా మారిన బై ఎలక్షన్

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్​పెట్టాయి. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం మూడు పార్టీలు తలపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా.. బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలని  ఆ పార్టీ ఆలోచనగా ఉంది. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే రంగంలోకి దిగారు. 

నియోజకవర్గంలో గత పది రోజులుగా పర్యటిస్తున్నారు. కాలనీల్లో  తిరుగుతూ, ప్రజలను  నేరుగా కలిసి  వారి ఇబ్బందులేంటో అడిగి తెలుసుకుంటున్నారు. మరో వైపు పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతోనూ వివేక్ సమావేశమవుతూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వివేక్  పర్యటన మొదలుపెట్టడంతో బీజేపీ కూడా అలర్ట్ అయింది. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం  సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక సవాల్ గా మారింది. అటు కాంగ్రెస్ తరఫున  రాష్ట్ర మంత్రి హోదాలో వివేక్ రంగంలోకి దిగడంతో కిషన్ రెడ్డి కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని  ప్రస్తుతానికి పక్కన పెట్టి, ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. 

కంటోన్మెంట్​ గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూపంలో మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొన్న ఆ పార్టీ.. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకుంది. లాస్య నందిత మరణంతో గతేడాది జూన్​లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీచేసిన శ్రీగణేశ్​విజయం సాధించారు. సెంటిమెంట్​తో గట్టెక్కుదామని దివంగత ఎమ్మెల్యే సాయన్న మరో కుమార్తె, నందిత  సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే సీన్ ను రిపీట్ చేయాలని కాంగ్రెస్​భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే ఈ సీటు నుంచి పోటీకి పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన క్రికెటర్ అజారుద్దీన్, సీఎం సన్నిహితుడిగా ముద్రపడ్డ ఫహీం ఖురేషీ ఈ సీటుపై కన్నేశారు. బీసీ కార్డుతో బరిలో దిగేందుకు నవీన్ యాదవ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో వైపు పీజేఆర్ కూతురు,  జీహెచ్‌‌ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. 

బీజేపీ నుంచి పోటాపోటీ.. 

ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ హైకమాండ్.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన దీపక్ రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకో వైపు పారిశ్రామిక వేత్త అయిన కీర్తిరెడ్డి కూడా పోటీకి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనమడు ఎన్వీ సుభాష్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. 

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి కూడా తనకు అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా అంటూ పార్టీ నేతల వద్ద ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలనేది పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టానికే పార్టీ హైకమాండ్ వదిలేసిందని పార్టీ లీడర్లు చెప్తున్నారు. 

సందిగ్ధంలో బీఆర్ఎస్..

బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి టికెట్​ఇస్తే ఎలా ఉంటుంది? గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? అని ఆలోచిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి టికెట్ ఇచ్చినా రెండోసారి సానుభూతి పనిచేయకపోవడంతో ఈసారి ఇక్కడ గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. మరోవైపు పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్దన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

 బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు రంగంలోకి దిగినా.. బీఆర్ఎస్ మాత్రం  ఇక్కడ ఇంకా తన ప్రచారాన్ని ప్రారంభించలేదు.