50 వేల డబ్బు, 2 లిక్కర్ బాటిళ్లు లంచం: అడ్డంగా దొరికిన జూబ్లీహిల్స్ ఎస్సై

50 వేల డబ్బు, 2 లిక్కర్ బాటిళ్లు లంచం: అడ్డంగా దొరికిన జూబ్లీహిల్స్ ఎస్సై

హైదరాబాద్: ఓ కేసు విషయంలో నిందితుడి దగ్గర లంచం తీసుకుంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్టేషన్‌లో రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని వంశీకృష్ణ అనే వ్యక్తిని ఎస్సై సుధీర్ రెడ్డి డిమాండ్ చేశాడు. అతడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. దీంతో వంశీకృష్ణ ఎస్సైకి లంచం ఇచ్చే సమయానికి సరిగ్గా తనిఖీలకు ఎంట్రీ ఇచ్చారు ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్ రావు టీం. రూ.50 వేల డబ్బుతో పాటు రెండు లిక్కర్ బాటిళ్లు లంచంగా అందుకుంటుండగా సుధీర్ రెడ్డిని పట్టుకున్నారు.

 

లంచం కోసం తాను నేరుగా నిందితుడిని డిమాండ్ చేయలేదని చెబుతున్నాడు ఎస్సై సుధీర్ రెడ్డి. సీఐ బలవంతయ్య ఆ డబ్బు తీసుకుని స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించడంతోనే తాను తీసుకున్నట్టు చెప్పాడు. అయితే ఏసీబీ రైడ్ విషయం తెలియడంతో సీఐ పరారయ్యాడు. ఎస్సైతో పాటు సీఐపై కూడా కేసు పెట్టామని, బలవంతయ్య కోసం గాలిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.