నేను ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్న : సీజేఐ చంద్రచూడ్

నేను ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్న :   సీజేఐ చంద్రచూడ్

న్యూఢిల్లీ: సేమ్ సెక్స్ జెండర్ల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమంటూ ఇటీవల ఇచ్చిన తీర్పుకు తాను కట్టుబడి ఉన్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ లా సెంటర్, న్యూఢిల్లీలోని సొసైటీ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘పర్ స్పెక్టివ్స్ ఫ్రమ్ ద సుప్రీంకోర్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్’ అనే అంశంపై మాట్లాడారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని ఇటీవల తాము ఇచ్చిన తీర్పు సరైనదేనని సీజే చంద్రచూడ్ తెలిపారు. ‘‘స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశం.. పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని బెంచ్ లోని ఐదుగురు జడ్జీలం అంగీకరించాం. 

దీనిపై ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చాం. అయితే దత్తత విషయంలో మాత్రం భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశాం. స్వలింగ సంపర్కులూ దత్తత తీసుకోవచ్చని ఇద్దరు జడ్జీలం తీర్పు ఇవ్వగా, ముగ్గురు జడ్జీలు వ్యతిరేకించారు. ఈ విషయంలో నేను మైనారిటీలో ఉన్నాను. ఇలా చీఫ్ జస్టిస్ మైనారిటీలో ఉన్న ముఖ్యమైన కేసులు 13 ఉన్నాయి. అయితే నేను కొన్నిసార్లు రాజ్యాంగాన్ని, కొన్నిసార్లు మనస్సాక్షిని నమ్ముతాను. తీర్పు సందర్భంగా నేను ఏదైతే చెప్పానో, దానికి కట్టుబడి ఉన్నాను’’ అని అన్నారు. స్వలింగ సంపర్కులు కూడా దత్తత తీసుకోవచ్చని చెప్పారు. ‘‘మన చట్టం ప్రకారం.. ఎవరైనా సింగిల్ పర్సన్ పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఒక మహిళ కూడా దత్తత తీసుకోవచ్చు. అలాంటప్పుడు కలిసి జీవిస్తున్న ఇద్దరు మహిళలు లేదా మగవాళ్లు దత్తత తీసుకోవడానికి వీల్లేదని చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవు” అని తెలిపారు.