రాజు మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

రాజు మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ
  • రేప్​ నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ 
  • నెల రోజుల్లో సీల్డ్ కవర్ లో రిపోర్టు ఇవ్వాలన్న హైకోర్టు 
  • విచారణాధికారిగా వరంగల్ జడ్జి నియామకం
  • సమాచారం, సందేహాలుంటే జడ్జికి చెప్పుకోవచ్చన్న కోర్టు 

హైదరాబాద్, వెలుగు: రేపిస్టు రాజు మృతిపై హైకోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. వరంగల్‌‌ థర్డ్‌‌ మెట్రోపాలిటన్‌‌ మేజిస్ట్రేట్‌‌ను విచారణాధికారిగా నియమించింది. నెల రోజుల్లో సీల్డ్ కవర్ లో రిపోర్టు అందజేయాలని ఆదేశాలిచ్చింది. రాజు పోస్టుమార్టం సందర్భంగా తీసిన వీడియోకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను శనివారం రాత్రి 8 గంటల్లోగా విచారణాధికారికి అందజేయాలంది. ఈ మేరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌‌ ఎంఎస్‌‌ రామచందర్‌‌రావు, జస్టిస్‌‌ అమర్‌‌నాథ్‌‌గౌడ్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులిచ్చింది. రాజుది ఆత్మహత్య కాదని, పోలీసులే హత్య చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ రూపంలో వేసిన పిల్ పై బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే జ్యుడీషియల్‌‌ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. రాజు మృతిపై ఎవరికైనా సందేహాలున్నా, ఏదైనా సమాచారమున్నా విచారణాధికారి ఎదుట చెప్పుకోవచ్చని తెలిపింది.

కచ్చితంగా హత్యే: పిటిషనర్  
మొదట పిటిషనర్ తరఫు లాయర్ వెంకన్న వాదిస్తూ... రాజుది కచ్చితంగా హత్యేనని ఆరోపించారు. ‘‘రాజు పోలీసుల అదుపులో ఉన్నారని మంత్రి కేటీఆర్‌‌ చెప్పారు. రాజు దొరికితే ఎన్‌‌కౌంటర్‌‌ చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రెండు దినాల్లో ఏం జరగబోతుందో చూడండని లోకల్‌‌ ఎమ్మెల్యే చెప్పారు” అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ల ప్రకటనలను బట్టి చూస్తే.. రాజును పోలీసులు పట్టుకొని చంపేసి, రైలు కింద పడేసి ఆత్మహత్యగా కథ అల్లారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ‘‘రాజు తల్లి, భార్యను సైదాబాద్‌‌ పోలీసులు ఈ నెల 10న అదుపులోకి తీసుకున్నారు. రాజు ఆచూకీ చెప్పాలని వాళ్లను ఒత్తిడి చేశారు. రాజు దొరికే వరకు.. అంటే ఈ నెల 15 దాకా వాళ్లిద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారు. రాజు పోలీసులకు పట్టుబడగానే వాళ్లను వదిలేశారు. ఆ తర్వాతే రాజు ఆత్మహత్య ఎపిసోడ్‌‌ తెరమీదకు వచ్చింది” అని వెంకన్న ఆరోపించారు. ఈ ఘటనపై 176(1)(ఎ) కింద న్యాయ విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన పోలీసులపై మర్డర్ కేసు పెట్టాలని కోరారు. కాగా, రాజుది ఆత్మహత్యేనని ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదించారు. పోలీసులు ఏడుగురి సాక్ష్యాలను నమోదు చేశారని, వీడియో కూడా తీశారని చెప్పారు. వాదనలు విన్న కోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

రాజు ఆత్మహత్యపై అనుమానాలు వద్దు: డీజీపీ
రేప్‌‌ కేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావులేదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం రాజు ఆత్మహత్య చేసుకుంటున్న టైంలో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారని ఆయన చెప్పారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ట్రాక్‌‌పై రాజును ఓ గ్యాంగ్‌‌మన్‌‌ చూశాడని తెలిపారు. రాజు పొదల్లో దాక్కోవడంతో గ్యాంగ్​మన్​  వెళ్లిపోయాడని, ఆ తర్వాత కోణార్క్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌  రైలు కిందపడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని  వివరించారు. శుక్రవారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ.. ట్రైన్​ను రన్‌‌ చేస్తున్న ఇద్దరు లోకో పైలెట్లు రాజు మృతి విషయం స్టేషన్‌‌ మాస్టర్​కు తెలిపారని, రైల్వే రికార్డ్స్‌‌లో కూడా సూసైడ్‌‌ వివరాలు రిజిస్టర్ చేశారని చెప్పారు. లోకో పైలెట్లతో పాటు స్థానిక రైతులు, గ్యాంగ్‌‌మన్‌‌ స్టేట్‌‌మెంట్లను వీడియో రికార్డింగ్‌‌ చేశామన్నారు. రాజు ఆత్మహత్య విషయంలో ఎవరూ అపోహలు సృష్టించవద్దని ఆయన సూచించారు.