
కరీంనగర్: మిడ్ మానేరు ప్రాజెక్టు నాణ్యతపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శుక్రవారం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత జీవన్ రెడ్డి రామడుగు మండలం గోపాల్ రావుపేట గ్రామంలో మీడియాతో మాట్లాడారు.
గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రతిపక్షాలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. వినోద్ కుమార్ రాజకీయాలు చేయడం తన స్థాయిని దిగజార్చుకోవడమేనని అన్నారు. రాజ్యంగ బద్ధమైన పదవులలో ఉండి వినోద్ కుమార్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తగదన్నారు. రుణమాఫి కోసం ఆరువేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తే ఆ సొమ్ము ఏమైందని అడిగారు. రైతులకు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అవేవి కంటికి కన్పించడం లేదా అంటూ ప్రశ్నించారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు లో బోగం ఒర్రె వద్ద లీకేజీ జరిగిందని, ఆ లీకేజి పునద్దరణకు ఇరవై కోట్లు కేటాయించినది నిజం కాదా? అని అడిగారు. లీకేజి పుణ్యమా అని లిఫ్ట్ చేసి నీటిని నింపుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విధమైన వైఫల్యాలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని జీవన్ రెడ్డి అన్నారు.