దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ.. జీఎస్టీ

దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ.. జీఎస్టీ

జీఎస్టీ.. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 2017 జూలై 1న ఇది మనదేశంలో అమల్లోకి వచ్చింది. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి.. ఇప్పటికి సరిగ్గా ఐదేళ్లు. జీఎస్టీ అమల్లోకి రావడం అనేది దేశ చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ. అది అధికారికంగా అమల్లోకి వచ్చిన తేదీని ఏటా ‘జీఎస్టీ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈసందర్భంగా దాని గురించి ప్రత్యేక కథనమిది. 

వాజ్పేయి హయాంలో తొలి అడుగు

కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు విధించే అనేక రకాల పన్నులను ఏకం చేసి దేశమంతటా ఒకే విధానంతో ఒకే రకమైన పన్నును తీసుకొచ్చారు. అదే ‘జీఎస్టీ’. ఈ  ఏకీకృత పన్ను విధానంతో సామాన్య ప్రజానీకంపై పన్ను భారం తగ్గడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరం అయ్యాయని పరిశీలకులు చెబుతున్నారు. దీనివల్ల జీడీపీ రేటులోనూ పెరుగుదల చోటుచేసుకుందని అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రావడం అంత తేలిగ్గా జరగలేదు. ఇది రాత్రికి రాత్రి చోటుచేసుకున్న పరిణామం కానే కాదు. దీని వెనుక 17 ఏళ్ల కృషి ఉంది. 2000 సంవత్సరంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఈ పన్ను సంస్కరణకు బీజం పడింది. సి. రంగరాజన్‌, ఐ.జి. పటేల్‌, బిమల్‌ జలాన్‌లతో కూడిన ఆర్థిక సలహా కమిటీ సూచనల మేరకు పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అసిమ్‌ దాస్‌ గుప్తా నేతృత్వంలో నాటి ప్రధాని వాజ్‌పేయి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జీఎస్టీ రూపురేఖలను సిద్ధం చేయడం సహా దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్ల బాధ్యతలను గుప్తా కమిటీకి అప్పగించారు. 2003లో విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.  12వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా జీఎస్టీని తీసుకురావాలని కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సు చేసింది.

2010 నుంచి రాజకీయాల నడుమ నలిగి 

ఈనేపథ్యంలో 2010 ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెస్తామంటూ యూపీఏ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. యూపీఏ హయాంలోని ఆర్థిక మంత్రులు.. చిదంబరం, ప్రణబ్‌ ముఖర్జీ ఈ దిశగా చేసిన కృషి ఫలించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు అభ్యంతరాలను లేవనెత్తడం, తదితర కారణాలతో దాని అమలుకు ఆటంకం ఏర్పడింది. జీఎస్టీ అమలు కోసం మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం 2011లో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును  ప్రవేశపెట్టింది. అయితే దీన్ని బీజేపీ, వామపక్ష పార్టీలు, మరికొన్ని విపక్ష పార్టీలు మరోసారి వ్యతిరేకించాయి. జీఎస్టీ వివాదాల అథారిటీపై కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారాలు కల్పించారంటూ.. స్థాయీ సంఘం మీటింగుల్లో గళం విప్పాయి. అలా చర్చలు, వివాదాలు, వ్యతిరేకతలు 2014 వరకు కొనసాగాయి. ఏ విధమైన ఏకాభిప్రాయం లభించకపోవడంతో జీఎస్టీ బిల్లు మరుగున పడింది. 

వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణతో మొదలు..

తర్వాతి టర్మ్ లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కీలక అడుగులు వేసింది. రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణకు సంబంధించిన ప్రాజెక్టును  యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసింది. దీంతో జీఎస్టీని అమల్లోకి తెచ్చేందుకు సాంకేతిక అవాంతరాలు తొలగిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం పోయి, తృణమూల్‌ కాంగ్రెస్‌ గద్దెపైకి ఎక్కింది. దీంతో జీఎస్టీ కమిటీ చైర్మన్ పదవి నుంచి అసిమ్‌దాస్‌ గుప్తా తప్పుకున్నారు. కేరళ ఆర్థిక మంత్రి కె.ఎం.మణికి ఆ బాధ్యతలను అప్పగించారు. 2015లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇలా రాజకీయాల మధ్య నలుగుతూ వచ్చిన జీఎస్టీ బిల్లుకు.. చివరికి 2015లో లోక్‌సభలో, 2016లో రాజ్యసభలో ఆమోదం లభించింది. పార్లమెంటు సెంట్రల్‌ హాలు సాక్షిగా 2017 జూన్‌ 30న అర్ధరాత్రి 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  చేతుల మీదుగా జీఎస్టీ ఆవిష్కృతమైంది. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ బిల్లును అనుసరించి ఏకీకృత పన్ను విధానం వల్ల ఉత్పాదక రంగంలో అత్యంత కీలకంగా ఉన్న పలు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయనే వాదనలు వినిపించాయి. దీనికి పరిష్కారంగా మొదటి ఐదేళ్ల పాటు రాష్ట్రాల ఆదాయానికి గండి పడకుండా కేంద్రం సహకరిస్తుందని నాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయంలో మొదటి మూడు సంవత్సరాలు 100 శాతం ..నాలుగో ఏడాదిలో 75 శాతం.. ఐదో ఏడాదిలో 50 శాతం భర్తీ చేస్తామని ఆయన నాడు పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చారు. రెండేళ్లపాటు అంతర్రాష్ట్ర వాణిజ్యంపైనా ఒక శాతం పన్ను విధించుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తామని జైట్లీ అప్పట్లో (2017 జూలైలో) వెల్లడించారు. 


 
500 రకాల పన్నులన్నీ కలిసి.. ఒకే పన్నుగా

జీఎస్టీ రాకతో భారతీయ పన్ను వ్యవస్థలో ఊహించని సంస్కరణలు చోటుచేసుకున్నాయి. దాదాపు 500 రకాల పన్నులన్నీ కలిసి.. ఒకే పన్నుగా అవతరించాయి.  జీఎస్టీ పరిధిలోకి ఎక్సైజ్, సేవా పన్నులు, రాష్ట్రాల వ్యాట్, ప్రవేశ పన్ను, ఇతర సుంకాలన్నింటినీ చేర్చారు.  పాత పన్నుల పద్ధతి ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేసేవి. జీఎస్టీ రాకతో పన్ను వసూళ్లకు ఏకరూపత లభించింది. ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వచ్చింది. వస్తు, సేవలపై కేంద్రమే పన్నులు విధించే పద్ధతి మొదలైంది. అయితే  కొన్ని  వస్తు, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాలు ద్వంద్వ పన్ను విధానాన్ని అమలు చేసే వెసులుబాటును కూడా కల్పించారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చాక.. రాష్ట్రాలు విధించే అమ్మకం పన్నులు కేంద్రానికి బదిలీ అయ్యాయి. అంటే కేంద్రమే ఆ పన్నులను వసూలు చేస్తోందన్న మాట. దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్‌కు చైర్మన్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవహరిస్తారు. కేంద్ర పన్నుల్లో విలీనమైన రాష్ట్రాల పన్నుల జాబితాను పరిశీలించినట్లయితే.. వ్యాట్, అమ్మకపు పన్ను, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, ప్రవేశ పన్ను, వినోదపు పన్ను, ప్రకటనల పన్ను, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సెస్‌లు, సర్ చార్జీలు కూడా కేంద్ర జాబితాలోకి వెళ్లిపోయాయి.  జీఎస్టీ కింద మొత్తం 3 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. అవి.. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటర్ స్టేట్ (అంతర్-రాష్ట్ర) జీఎస్టీ. సెంట్రల్ జీఎస్టీ.. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. స్టేట్ జీఎస్టీ అనేది.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది. పన్ను లావాదేవీలను రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చినపుడు ‘ఇంటర్-స్టేట్’ జీఎస్టీని వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పంచుతుంది.