ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. పెరుగుతున్న అడ్మిషన్లు

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. పెరుగుతున్న అడ్మిషన్లు
  • గత ఏడాది కంటే 30 శాతం ఎక్కువ అడ్మిషన్లు చేయాలని టార్గెట్
  • డీఐఈవోతో పాటు ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల ప్రచారం

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. గత ఏడాది కంటే 30 శాతం అదనంగా అడ్మిషన్లు చేయించాలని ఇంటర్మీడియట్​ బోర్డు టార్గెట్​ విధించింది. అందుకు అనుగుణంగానే జిల్లాలో అడ్మిషన్లు పెరిగాయి. గత విద్యాసంత్సరంలో ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో కలిపి 1,775 మంది స్టూడెంట్లు అడ్మిషన్లు పొందారు. ఈ విద్యాసంవత్సరం టార్గెట్​ ప్రకారం 2,307 మంది స్టూడెంట్లకు ఫస్ట్​ ఇయర్​లో చేర్పించాల్సి ఉండగా, ఇప్పటికే 2,207 మంది చేరారు. మరికొంత మంది కాలేజీల్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

తగ్గిన బాలికలు..​

జిల్లాలో 15 మండలాలు ఉండగా ,12 ప్రభుత్వ జూనియర్​ కాలేజీలున్నాయి. కొత్త మండలాల్లో ఒక్క మండలంలోనే జూనియర్​ కాలేజీ ఉంది. దీనికితోడు జిల్లాలో ఈ ఏడాది 15 కేజీబీవీల్లో ఆరింటిలో ఇంటర్మీడియట్​ అప్​గ్రేడ్​ చేశారు. దీంతో కేజీబీవీల్లో చదువుకుంటూ టెన్త్​ పాస్​ అయిన గర్ల్స్​​అన్ని సౌలతులు, ముఖ్యంగా సెక్యూరిటీ ఉంటుందన్న నమ్మకంతో గ్రామీణ ప్రాంత బాలికలు అక్కడే కంటిన్యూ అవుతున్నారు.

 జిల్లా చిన్నది కావడం, జూనియర్​ కాలేజీల మధ్య దూరం తక్కువగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. జిల్లా సరిహద్దులో ఉన్న మండలాల్లోని విద్యార్థులు మహబూబ్​నర్, నాగర్​కర్నూల్​ జిల్లాలోని జూనియర్​ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో చేరడం హర్షణీయమని అంటున్నారు.

కాలేజీల బలోపేతానికి నిధులు..

జూనియర్​ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, మెయింటెనెన్స్​ కోసం రూ.2.30 లక్షలు, గేమ్స్​ కిట్ కోసం ప్రతి కాలేజీకి రూ.10 వేల చొప్పున రూ.1.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యార్థులకు ప్రతి ఏడాది పుస్తకాలు ఫ్రీగానే ఇస్తున్నారు. ప్రతి కాలేజీలో లెక్చరర్ల బోధన, స్టూడెంట్ల అటెండెన్స్​ను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 12 కాలేజీల్లో క్లాస్​రూమ్, ల్యాబ్, ప్రిన్సిపాల్​ రూమ్​లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిన్నపాటి రిపేర్లు, తాగునీరు, విద్యుత్​ సౌకర్యం ఏర్పాటుకు రూ1.28 కోట్ల నిధులు మంజూరు చేశారు. 

 నాణ్యమైన విద్య అందిస్తున్నాం..

గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లతో పాటు నేను గ్రామాల్లో తిరిగి టెన్త్​ స్టూడెంట్ల పేరెంట్స్​కు అవగాహన కల్పించాం. మా కృషి ఫలించింది. సెక్రటరీ ఇచ్చిన టార్గెట్​ కన్నా ఎక్కువ అడ్మిషన్లు వచ్చాయి. గెస్ట్​ ఫ్యాకల్టీలతో లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేస్తాం. - ఎర్ర​ అంజయ్య, డీఐఈవో, వనపర్తి