
- ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలి: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 253 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. శనివారంలోగా దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో అబ్ధుల్ రెహమాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ ఆఫీస్ ఏర్పాటు చేయాలి
సిద్దిపేట జిల్లాలో గిరిజన సంక్షేమ ఆఫీస్లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్టీ ఎఫ్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ ఎల్లంతో కలిసి కలెక్టర్ హైమావతి కి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో చేపట్టిన పనుల బిల్లులు తొమ్మిదిన్నర లక్షలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాజీ సర్పంచ్ తిప్పని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ కు బిల్లులు విడుదల చేయాలని కోరుతూ అర్జీని అందజేశారు. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి స్కీంలో తమకు ఇళ్లు మంజూరయ్యాయని, తాము ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నా తమకు నిధులు మంజూరు కాలేదని వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరుతూ నంగునూర్ మండలం సిద్దన్నపేట, అక్కెనపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు అర్జీని అందజేశారు. జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గీత కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు.
మెదక్ టౌన్: ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మొత్తం 66 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వాటిలో భూ సమస్యలు14 , పింఛన్లు7, ఇందిరమ్మ ఇండ్లు 6, ఇతర సమస్యలు - 39 ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కనీస వసతులు కల్పించండి..
తూప్రాన్: పట్టణంలోని అరితాస్ గోల్డెన్ వెంచర్ లో నివసించే ప్రజలు తమకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ ప్రజావాణిలో భాగంగా వినతిపత్రాన్ని అందించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీ గౌడ్, రమేశ్ చారి మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న పలు సమస్యలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు యాదగిరి, సతీశ్, గోపాల్, సాయిబాబా, స్వామి గౌడ్ ఉన్నారు.
కేంద్ర బృందానికి వివరాలను అందించాలి
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పథకాల పరిశీలనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జోసెఫ్, వినోద్ నేతృత్వంలో వచ్చిన బృందం కలెక్టర్ హైమావతితో సమావేశం అయింది. జిల్లాలో వారు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన విషయాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ బృందం నేటి నుంచి 24 వరకు జిల్లాలోని బెజ్జంకి, అక్కన్నపేట, కొమరవెల్లి మండలాల్లో పర్యటించి, ఎంఎన్ఆర్ఈజీఎస్, పింఛన్లు, వాటర్ షెడ్, గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్ యోజన, గ్రామపంచాయతీలు తదితర పథకాల అమలును పరిశీలిస్తారని చెప్పారు.
అనంతరం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ప్రాజెక్టులో సంగారెడ్డి మెయిన్ కెనాల్ కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అర్ అండ్ ఆర్ కాలనీ, కాల్వల భూ సేకరణ పై రెవెన్యూ అధికారులతో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ సర్వే పూర్తవగానే అవార్డ్ పాస్ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ సైతం పూర్తి చేయాలని, కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామంలో మిషన్ భగీరథ పంపు హౌస్ నిర్మాణం కోసం భూ సేకరణ చేయాలని సూచించారు.
ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లావ్యాప్తంగా రైతులకు 4,500 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చిలిపిచెడ్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. ధరల పట్టికలను పరిశీ లించి విత్తన ధరలను అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ ఆధారంగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీ, అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరా కోసం ప్రభుత్వం జీవో నెంబరు 16 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ టెండర్ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.