
- ఉక్రెయిన్తో సంధి కుదుర్చుకోకుంటే
- రష్యాపై భారీగా పన్నులు వేస్తా
- పుతిన్‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
- ఆయన వైఖరి అస్సలు నచ్చట్లేదు: ట్రంప్
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకాలని, ఆ దేశంతో సంధి కుదుర్చుకోవాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సూచించారు. ఇందుకు గడువు 50 రోజులేనని, అప్పటికీ ఉక్రెయిన్తో సంధి కుదుర్చుకోకుంటే రష్యాపై భారీగా పన్నులు, ఆంక్షలు విధిస్తానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం న్యూజెర్సీలో ఆయన మాట్లాడుతూ.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్ తీయగా మాట్లాడుతూనే బాంబుల వర్షం కురిపిస్తాడని మండిపడ్డారు.
పుతిన్ విధానాలు తనకు ఏమాత్రం నచ్చడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపిస్తామని ప్రకటించారు. అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న ట్రంప్ సూచననూ పుతిన్ తోసిపుచ్చారు. దీంతో పుతిన్‌పై ట్రంప్ సంచలన కామెంట్లు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి రక్షణ ఎంతో అవసరమన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్‌ను వీక్షించి వెళ్తూ.. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లడారు. ‘‘ఉక్రెయిన్‌కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అత్యాధునిక ఆయుధాలు పంపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరం. వాళ్లు మాకు డబ్బులు చెల్లిస్తారు. ఇది మాకు బిజినెస్ లాంటిది. పుతిన్ వ్యవహారశైలి అస్సలు బాగోలేదు. రష్యాపై ఆంక్షలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. మున్ముందు ఏం జరుగుతుందో చూడండి’’అంటూ ట్రంప్ అన్నారు.