
GST Notices: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు యూపీఐ పేమెంట్స్ సౌలభ్యానికి మారటంతో దానికి అనుగుణంగానే వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించటం ప్రారంభించారు. అయితే ఈ పరిస్థితులు చిన్న వ్యాపారులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో చాలా మంది వ్యాపారులు No UPI Only Cash అంటూ కస్టమర్లకు చెప్పేస్తున్నారు.
కర్ణాటకలోని జీఎస్టీ అధికారులు తాజాగా యూపీఐ చెల్లింపులకు సంబంధించిన డేటాను పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తెప్పించుకుంది. ఇందులో UPI చెల్లింపుల ద్వారా వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైగా ఉంటూ GST ఎగవేతకు పాల్పడుతున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని కర్ణాటక వాణిజ్య పన్ను శాఖ తీసుకున్న నిర్ణయం చిన్న వ్యాపారులు, దుకాణదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో చాలా మంది ముందుగానే అప్రమత్తం అయ్యి యూపీఐ చెల్లింపులను నిరాకరిస్తున్నారు. తమ వ్యాపార స్థలాల్లోని క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను కూడా వారు తొలగిస్తున్నారు. కస్టమర్లను క్యాష్ పేమెంట్స్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడైంది.
2021-22 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించిన యూపీఐ బిజినెస్ ఖాతాలా ట్రాన్సాక్షన్స్ వివరాలను కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించింది. ఇందులో యూపీఐ పేమెంట్స్ ద్వారా రూ.40 లక్షల కంటే ఎక్కువ వార్షిక వ్యాపారం చేసి దానిని నివేదించకుండా పన్ను ఎగవేసిన వ్యాపారులను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 14వేల కేసులను అధికారులు గుర్తించారని కర్ణాటక వాణిజ్య పన్నుల కమిషనర్ విపుల్ బన్సాల్ చెప్పారు. ప్రస్తుతానికి వ్యాపారులకు నోటీసులు మాత్రమే పంపినట్లు ఆయన చెప్పారు.
►ALSO READ | పన్ను అధికారుల సోదాలు.. ఏకకాలంలో 200 ప్రాంతాల్లో, మీరూ ఆ తప్పు చేస్తున్నారా..?
యూపీఐ చెల్లింపులు ప్రాచుర్యం పొందాయని వీటిని కస్టమర్ల ప్రవర్తన ద్వారా నడుస్తోందన్నారు. నగదుకు బదులుగా చిన్న చెల్లింపులను ఇవి అనుకూలంగా రివార్డింగ్ గా మార్చాయన్నారు. కొందరు వ్యాపారులు క్యాష్ చెల్లింపులు డిమాండ్ చేస్తున్నప్పటికీ అది దీర్ఘకాలంలో కుదరదని చెప్పారు. కొందరు నిరాకరించినప్పటికీ మరికొందరు వ్యాపారులు యూపీఐ చెల్లింపులు అంగీకరిస్తారని బన్సాల్ చెప్పారు. తాము మాత్రం చట్ట ప్రకారమే ముందుకెళతామని చెప్పారు.
కొందరు వ్యాపారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు వెల్లడైంది. అయితే కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నారు. యూపీఐ చెల్లింపులే ఏడాదికి రూ.40 లక్షలు దాటితే వ్యాపారులు చేపట్టిన క్యాష్ ట్రేడింగ్ కూడా కలిపితే అది మరింతగా పెరుగుతాయంటున్నారు. కొందరు వ్యాపారులు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలతో వ్యాపార చెల్లింపులను నిర్వహిస్తూ వారి టర్నోవర్ తక్కువగా చూపాలని చూస్తున్నారని అన్నారు. ఒక యూజర్ తాను చాలా కాలం తర్వాత తొలిసారిగా ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేశానని అన్నారు. మరొకరు తాను లాండ్రీకి ఇవ్వగా వ్యాపారి నగదు చెల్లింపు కావాలని యూపీఐ పేమెంట్స్ నిలిపివేసినట్లు చెప్పినట్లు వెల్లడించాడు. ఇకపై వ్యాపారులు పన్ను ఎగవేతలు కష్టమేనని ఇదంతా చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పుడు కర్ణాటక దీనిని స్టార్ట్ చేసింది రానున్న కాలంలో ఇతర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.