
పన్ను అధికారుల నుంచి గతంలో మాదిరిగా తప్పుడు క్లెయిమ్స్ పొందటం ఇకపై కుదరదు. చిన్న మెుత్తాల కోసం పన్ను చెల్లింపుదారులు చేసే తప్పుడు ప్రయత్నాలను ఆదాయపు పన్ను శాఖ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని రకాల మోసాలను టార్గెట్ చేస్తూ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ నేడు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 మందికి పైగా వ్యక్తులు, సంస్థలపై సోదాలు చేపట్టింది. నకిలీ విరాళాలను ఉపయోగిస్తూ పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రస్తుతం టార్గెట్ చేసుకుంది. ప్రధానంగా ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చులు, రాజకీయ పార్టీలకు విరాళాల పేరుతో నకిలీ పత్రాలను పన్ను అధికారులకు అందించి టాక్స్ రిబేట్స్, రీఫండ్స్ పొందుతున్న వ్యక్తులను అలాగే వారికి సహాయం చేస్తున్న సంస్థలను టార్గెట్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులను ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు.
అందుకే పన్ను చట్టంలోని సెక్షన్ 80 జీజీసీ కింద అందించే విరాళాల క్లెయిమ్స్ గురించి పన్ను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాత పన్ను విధానంలో లభించే మినహాయింపుల దుర్వినియోగాన్ని నిరోధించడానికే ప్రస్తుతం దాడుల లక్ష్యంగా తెలుస్తోంది. సరైన పత్రాలు లేకుండా ప్రయోజనాల మాటున పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న వ్యక్తులను ఐటీ శాఖ ప్రస్తుతం టార్గెట్ చేసింది.
►ALSO READ | సోషల్ మీడియాలో హైదరాబాద్ Vs బెంగళూరుపై చర్చ : ఇక బెంగళూరును వదిలేయాల్సిందేనా..!
అయితే పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వ్యక్తులు తమ అనుమానాస్పద లేదా ఫ్రూప్ లేని చెల్లింపులు, డొనేషన్స్ వివరాలను వెంటనే తొలగించి నవీకరించిన రిటర్న్స్ దాఖలు చేయాలని పన్ను శాఖ చెబుతోంది. ఇది వారిని జరిమానాల నుంచి రక్షిస్తుందని హెచ్చరించింది.