ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత : కలెక్టర్ కుమార్ దీపక్
  •     సమస్యల పరిష్కారానికి చర్యలు
  •     అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలి
  •     ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్లు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/నస్పూర్/నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 

తమ తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారని, సవరించా లని కోరుతూ జైపూర్ మండలం టేకుమట్లకు చెందిన జి.నాగరాజు అర్జీ అందించారు. నెన్నెల మండలం జంగల్​పేట్ కు చెందిన మరుశెట్టి లక్ష్మయ్య తమ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, న్యాయం చేయాలని కోరారు. బెల్లంపల్లి మండలం పెద్దనపల్లిలో10వ వార్డులో అంగన్వాడీ ఏర్పాటు చేయాలని కోరుతూ, జీవో 49ను రద్దు చేయాలని.. మొత్తంగా 39 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్​ తెలిపారు.

పెండింగ్‌ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి ద్వారా వచ్చిన  ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని నిర్మల్​ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి అమలును తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్‌, కిశోర్ కుమార్‌, ఆర్డీవో రత్నకల్యాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో భారీగా దరఖాస్తులు

​ఆదిలాబాద్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అన్ని మండలాల నుంచి మొత్తం 131 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​రాజర్షి షా తెలిపారు. సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల గురించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్​ను తనిఖీ చేస్తూ మెనూ ప్రకారం పోషకా హారం, స్నాక్స్ అందిస్తున్నారా లేదా తదితర విషయా లపై పర్యవేక్షించాలని సూచించారు.

బెదిరిస్తున్నారు.. న్యాయం చేయండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వరరావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జైనూర్ మండలం జంగంకు చెందిన కోవ దాదారావు తన తండ్రి కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వమంటే వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరాడు. 

కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ కు చెందిన కవిత మండల్ తమ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని, చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, పట్టా పాస్​బుక్కులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు.