
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గండికొట్టే సంగమేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ‘వీ6 వెలుగు’ 2019 నుంచి 2021 వరకు మూడేండ్ల పాటు సుదీర్ఘ పోరాటమే చేసింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీకి దిగువన 800 అడుగుల నుంచే రోజుకు 3.5 టీఎంసీల నీటిని తరలించేలా సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు, అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచే విస్తరణ పనులు చేపట్టేందుకు ఏపీలో అప్పటి జగన్ సర్కారు ప్లాన్ వేసింది. దీనిపై 2019 నవంబర్‌న ‘కృష్ణా ఏపీ కొత్త లిఫ్ట్’ శీర్షికన ‘వీ6 - వెలుగు’ తన మొదటి కథనం ప్రచురించగా, తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ‘వెలుగు’ వరుస కథనాలతో డిసెంబర్‌న పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్‌పనులు ఆపాలని కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్‌చేయక తప్పలేదు. డిసెంబర్ 13న ‘పోతిరెడ్డిపాడు విస్తరణకు జగన్ ప్లాన్’ శీర్షికతో వెలుగు మరో కథనం ప్రచురించింది. అయినా నాటి బీఆర్ఎస్ సర్కారు చోద్యం చూడడంతో జగన్ సర్కారు అన్నంత పనీ చేసింది. 2020 మే 5న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌విస్తరణ కోసం జీవో నం. 203 జారీ చేసి, రూ.6,820 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్తూ మే6 నుంచి వెలుగు వరుస కథనాలు ప్రచురించింది. దీంతో మే 12న పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఇరిగేషన్ ప్రిన్సిపల్‌సెక్రటరీ ఫిర్యాదు చేశారు. మే 21న ఏపీ అక్రమ ప్రాజెక్టుల పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేయడంతో ఎన్జీటీ వెంటనే స్టే ఆదేశాలు జారీ చేసింది.
►ALSO READ | నీళ్లు.. నిధులు..నియామకాలు.. తెలంగాణ మలి దశ ఉద్యమ ట్యాగ్ లైన్ ఇది!
‘వీ6 వెలుగు’ వెనక్కి తగ్గకపోవడంతో జూన్‌న మరోసారి కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్‌సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చారు. ఈలోగా ఆగస్టు 5న కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్ సాకుతో అపెక్స్ కౌన్సిల్ భేటీని సీఎం కేసీఆర్ వాయిదా వేయించారు. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న జగన్ సర్కారు ఆగస్టు 19న సంగమేశ్వరం టెండర్ల ప్రాసెస్ పూర్తిచేయించింది. మరోవైపు ఆగస్టు 21న ఎన్జీటీలో గవినోళ్ల పిటిషన్ పై తీర్పు రావాల్సిన రోజే కేసీఆర్ సర్కారు రీఓపెన్ పిటిషన్ ఫైల్ చేయడంతో తీర్పు వాయిదా పడింది. దీంతో ఏపీ చేపట్టిన సంగమేశ్వరానికి బీఆర్ఎస్ సర్కారు ఒక పథకం ప్రకారం సహకరించినట్లు స్పష్టమైంది. అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి సీఎం కేసీఆర్ కుట్రకోణం మరోసారి బయటపడింది. ఆ మీటింగ్‌లో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన నష్టంపైనే మాట్లాడిన కేసీఆర్, ఏపీ కొత్తగా చేపడ్తున్న అక్రమ ప్రాజెక్టులపై నోరుమెదపలేదు.
►ALSO READ | Banakacharla : బనకచర్ల ప్రాజెక్టు పైన ‘వెలుగు’ కథనాలతోనే కదలిక
మరోవైపు అక్టోబర్ 29న ఏపీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ అప్పటికే రెండు నెలల పుణ్యకాలం గడిచిపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో ఎన్జీటీ ఆదేశించినా పనులు ఆగడం లేదని, సంగమేశ్వరం దగ్గర అక్రమంగా పనులు జరుగుతున్నాయని విజువల్స్, ఫొటోలతో ‘వీ6 వెలుగు’ డిసెంబర్ 13న ‘సారూ.. సంగమేశ్వరం కడుతున్నరు..’ శీర్షికతో ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై డిసెంబర్ 19న కృష్ణా బోర్డుకు ఇరిగేషన్‌ఈఎన్సీ కంప్లైంట్‌చేశారు. డిసెంబర్ 22న ఎన్జీటీ తీర్పును ఏపీ ధిక్కరించినట్లుగా మళ్లీ గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేసినా దీనిపై బీఆర్ఎస్ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2021 మార్చి 20న ఒకసారి, జూన్9న మరోసారి సంగమేశ్వరంపై కేఆర్‌ఎంబీకి, తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్‌చేసి ఊరుకున్నారు. ఆర్నెళ్ల ముందే ‘వీ6 వెలుగు’లో ఫొటోలు, విజువల్స్ వచ్చినా సంగమేశ్వరలో పనుల ఫొటోలే తమకు దొరకలేదని నాటి మంత్రి ప్రశాంత్ రెడ్డి జూన్ 24న, ఆ పనుల గురించి తమకు ఈ మధ్యే తెలిసిందని జూన్ 25న మంత్రి జగదీశ్ రెడ్డి బుకాయించారు. దీనినిబట్టి పోతిరెడ్డిపాడు విస్తరణను, సంగమేశ్వరం ఎత్తిపోతల స్కీమును నాటి బీఆర్ఎస్ సర్కారు ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టమైంది.
►ALSO READ | సంగమేశ్వరం నుంచి బనకచర్ల దాకా.. కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం
మొత్తం మీద ఇరురాష్ట్రాలకు కావాల్సిన ఓ బడా కాంట్రాక్టర్ భారీ స్థాయిలో ఇచ్చిన కమీషన్ల కోసమే సంగమేశ్వరానికి నాటి బీఆర్ఎస్ సర్కారు సహకరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు ఊతమిచ్చే పలు కథనాలను కూడా ‘వీ6 వెలుగు’ సాక్ష్యాధారాలతో ప్రచురించింది. కృష్ణాకు ఇటువైపు ‘పాలమూరు– రంగారెడ్డి’ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థే సంగమేశ్వరం పనులు చేస్తుండడం, పాలమూరు తవ్వకాల్లో బయటపడ్డ మట్టి, ఇసుక, కంకర, రాళ్లను ప్రత్యేక జెట్టిల్లో వేసి ఏపీ వైపు సంగమేశ్వరం పనుల కోసం తరలిస్తున్న విషయాన్ని ‘మేగా చీటింగ్’ పేరుతో జులై17, 2021న వెలుగులోకి తెచ్చింది. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ స్కీముకు తెలంగాణ సర్కారు సంపూర్ణ మద్దతు ఉన్న విషయం ఈ కథనం ద్వారా తెలిసి యావత్ తెలంగాణ సమాజం నివ్వెరబోయింది.