
నాడు బీఆర్ఎస్ హయాంలో ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనే కాదు, ఇటీవల గోదావరి– -బనకచర్ల ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రం చర్యలను మొట్టమొదట ‘వెలుగు’ బయటకుతెచ్చింది. ‘వెలుగు’ వరుస కథనాల వల్లే కాంగ్రెస్ సర్కారులో కదలిక వచ్చి, కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకునే వరకు వెళ్లింది. వాస్తవానికి నిరుడు డిసెంబర్లోనే జీబీ లింక్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించింది. జనవరిలో దానిపై గుట్టుగా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేసింది. దీనిపై 2025 జనవరి 5న ‘బనకచర్లతో ఏపీ భారీ కుట్ర!’ పేరుతో ‘వెలుగు’ కథనాన్ని ప్రచురించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల జలదోపిడీకి ఎలా ప్లాన్ వేసిందో వివరించింది.
►ALSO READ | సంగమేశ్వరంపై V6 వెలుగు సుదీర్ఘ పోరాటం
ఆ తర్వాత అదే నెల 31న ‘గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్’ పేరిట ఇంకో కథనాన్ని ప్రచురించింది. బనకచర్లతో పాటు దానికి సమాంతరంగా గోదావరి నుంచి సోమశిలకు 200 టీఎంసీల నీటిని దోచుకెళ్లే ఏపీ ప్లాన్‌ను వివరించింది. ఇక, ఆ మరుసటి నెల అంటే ఫిబ్రవరి 21న ‘రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట’ పేరుతో మరో కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీ కేంద్రంగా జీబీ లింక్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్న కుట్రలను వెలుగులోకి తెచ్చింది.
►ALSO READ | సంగమేశ్వరం నుంచి బనకచర్ల దాకా.. కృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం
గోదావరి మిగులు జలాల చాటున కృష్ణా జలాల దోపిడీకి బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నదో వివరిస్తూ మార్చి 7వ తేదీన ‘కృష్ణా నీటి దోపిడీకే బనకచర్ల’ అనే హెడ్‌లైన్‌తో స్పెషల్ స్టోరీని వెలుగు పబ్లిష్ చేసింది. ఇక, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన అంశాన్ని వివరిస్తూ ఏప్రిల్ 10న ‘బనకచర్లపై ఏపీ దూకుడు!’ పేరుతో ఇంకో కథనాన్ని ప్రచురించింది. ఇలా ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఇటు వెలుగు పత్రిక, అటు వీ6 చానల్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ సర్కారు, ఏపీ దూకుడుకు కొంతలో కొంత బ్రేక్ వేయగలిగింది.
►ALSO READ | నీళ్లు.. నిధులు..నియామకాలు.. తెలంగాణ మలి దశ ఉద్యమ ట్యాగ్ లైన్ ఇది!