
ప్రత్యేక రాష్ట్రం దిశగా యావత్ తెలంగాణ సమాజాన్ని నడిపించింది ఈ ఆకాంక్షలే. కానీ స్వరాష్ట్రంలో ఈ ఉద్యమ ఆశయాలను తొలి తెలంగాణ సర్కారు తుంగలో తొక్కినప్పుడు, ముఖ్యంగా కృష్ణా జలాలపై హక్కులను పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేసినప్పుడు బాధ్యత గల మీడియా హౌస్ గా ‘వీ6 వెలుగు’ రంగంలోకి దిగింది. పొరుగురాష్ట్రం ‘జల’ కుట్రలను ముందే పసిగట్టి, ఆధారాలతో సహా కండ్లకుగట్టడమే కాదు, స్వరాష్ట్రంలో మొద్దు నిద్ర పోతున్న పాలకుల కండ్లు తెరిపించి కర్తవ్యబోధ చేయడంలోనూ ‘వీ6 వెలుగు’ ముందువరసలో నిలిచింది. ఒకటా, రెండా.. పదులు, వందల వార్తా కథనాలను ప్రచురించడం ద్వారా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో తనపై జరిగిన అనేక కుట్రలు, కుతంత్రాలకు ‘వీ6 వెలుగు’ దీటుగా ఎదుర్కొంది.
►ALSO READ | Banakacharla : బనకచర్ల ప్రాజెక్టు పైన ‘వెలుగు’ కథనాలతోనే కదలిక
ముందుగా చెప్పినట్లు మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల చుట్టే తిరిగింది. ప్రత్యేక రాష్ట్రం దిశగా సబ్బండ వర్ణాలను ముందుకు నడిపించింది ఈ ఆకాంక్షలే! సరిగ్గా ఈ మూడు అంశాలనే నాటి ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రచారాస్త్రాలుగా మలుచుకొని, తనదైన యాస, ప్రాసలతో ప్రజల్ని ఆకర్షించగలిగారు. ఆంధ్రా పాలకులు.. శ్రీశైలానికి పోతిరెడ్డిపాడు వద్ద పొక్కగొట్టి, కృష్ణా జలాలను ఏవిధంగా సీమకు తరలిస్తున్నారో.., పక్కనే కృష్ణా నది పారుతున్నా పాలమూరు బీళ్లు ఎందుకు నోళ్లు తెరిచాయో.., ఇక్కడి బిడ్డలు పొట్టచేతపట్టుకొని ఎందుకు ముంబై బస్సులు ఎక్కుతున్నారో.., నల్లగొండ బిడ్డల కాళ్లు, చేతులు ఎందుకు వంకర్లు తిరుగుతున్నాయో కేసీఆర్ చెప్తుంటే అప్పట్లో తెలంగాణ ప్రజానీకం ఏపీ పాలకులపై శివమూగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ క్రమంలో వందలాది యువత బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఆ ఉద్యమ నేతే తొలి ముఖ్యమంత్రి కావడంతో తమ అకాంక్షలు నెరవేరుతాయని సామాన్య జనంలాగే ‘వీ6 వెలుగు’ ఆశించింది. గోదావరి, కృష్ణా నీళ్లు మన బీళ్లకు మళ్లుతాయని, మిగులు నిధులతో రాష్ట్ర ఖజానా కళకళలాడుతుందని, నియామకాలతో నిరుద్యోగ సమస్య సమసిపోతుందని కలలు కన్నది. కానీ ఏడాది తిరిగే లోపలే నాటి పాలకుల నిజస్వరూపం బయటపడింది.
►ALSO READ | నాడు..నేడు..రాష్ట్ర ప్రయోజనాలకే V6 వెలుగు పెద్దపీట