
బీఆర్ఎస్ సర్కారు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కృష్ణా జలాలపై పోరాటాన్ని ‘వీ6 వెలుగు’ ఆపలేదు. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి దొడ్డిదారిలో నీళ్లు మళ్లించుకుపోయేలా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (సంగమేశ్వర) పనులు శరవేగంగా నడుస్తున్నాయని పేర్కొంటూ ‘ఆగని రాయలసీమ లిఫ్ట్!’ పేరుతో గతేడాది అక్టోబర్30న ‘వెలుగు’ ప్రముఖంగా ప్రచురించింది. ఏపీలో అప్పటి జగన్ సర్కారు ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నా నాటి బీఆర్ఎస్ సర్కారు కళ్లు మూసుకుందని, తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రాయలసీమ లిఫ్ట్‌ను అడ్డుకునేందుకు ఎందుకు దృష్టి పెట్టడంలేదని నిలదీసింది. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసింది. దీంతో
మార్చి 15న పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపి, ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తేవాలని ఏపీని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) ఆదేశించింది. కాగా, ఈఏసీ ఆదేశాలను ఏపీ బేఖాతర్ చేస్తోందని, రీస్టోరేషన్ పనులు చేపట్టకుండా చోద్యం చూస్తోందని జూన్2న ‘రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ డోంట్ కేర్’ పేరుతో మరో కథనాన్ని వెలుగు పబ్లిష్ చేసింది. దీంతో ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ లేఖ రాసింది. వెంటనే రీస్టోరేషన్ పనులు చేపట్టేలా ఏపీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.
దీనికితోడు ఏపీ గుట్టుగా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు తిరిగి ప్రారంభించిందని, దీని కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 90 వేల క్యూసెక్కులకు పెంచుతోందని, పూర్తయితే రోజూ 8 టీఎంసీలను తన్నుకుపోయే ప్రమాదముందని హెచ్చరిస్తూ ఏప్రిల్ 11న ‘శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం!’ పేరుతో ‘వెలుగు’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లెటర్ రాసింది. కాగా, ఏపీ ప్రభుత్వ రెండు నాల్కల తీరును ఎండగడ్తూ ‘ముందు నీతులు.. వెనుక గోతులు!’ పేరుతో ఈ నెల 3న ‘వెలుగు’ ప్రత్యేక కథనం ప్రచురించింది. తెలంగాణ నీటి హక్కులపై ఏపీ ఎలా కుట్రలు చేస్తోందో, సహకరించుకుందామంటూనే మన ప్రాజెక్టులను ఎలా అడ్డుకుంటుందో సాక్ష్యాధారాలతో సహా వివరించింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవంటూ ట్రిబ్యునల్‌లో వాదించడాన్ని, పాలమూరు, డిండి, సీతారామ, కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడాన్ని, సాగర్ ప్రాజెక్టును మనకు అప్పగించకుండా ఏపీ మోకాలడ్డుతున్న తీరును తూర్పారబట్టింది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై మన వాదన నిజం కాదంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడడమే కాకుండా, ఆ అంశం ప్రగతి మీటింగ్‌లో చర్చకు రాకుండా ఏపీ ఎలా కుట్రలు పన్నుతుందో సోదాహరణంగావివరించింది.