క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు కొట్టేస్తున్న కేటుగాళ్లు.. మీ కార్డులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!

క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు కొట్టేస్తున్న కేటుగాళ్లు.. మీ కార్డులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!

Credit Card Frauds: సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త కుంభకోణాలకు మార్గాలను వెతుక్కుంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ యుగంలో చేతిలో డబ్బు ఉండటం కంటే బ్యాంకుల్లో, క్రెడిట్ కార్డుల్లో డబ్బు ఉంచుకోవటం మరింత ప్రమాదకరంగా మారిపోతోంది. బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రజలను ఎంత అప్రమత్తం చేస్తున్నప్పటికీ కేటుగాళ్లు తాము అంతకు మించిన తెలివైనవాళ్లం అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. 

తాజాగా దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఒక క్రెడిట్ కార్డ్ కస్టమర్ నుంచి ఏకంగా రూ.8 లక్షలు కాజేసిన వార్త అందరినీ షేక్ చేస్తోంది. మే 3 నుంచి 30 మధ్య కాలంలో సదరు వ్యక్తి క్రెడిట్ కార్డ్ ఖాతా నుంచి పలు దఫాలుగా ఈ మెుత్తాన్ని తస్కరించినట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన బంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మోసం జరిగింది ఇలానే..
బ్యాంక్  క్రెడిట్ కార్డ్ టెలికాలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసినట్లు నేరగాళ్లు కస్టమర్ ను ముందుగా నమ్మించారు. కొత్త కార్డ్ ఇష్యూ కోసం ఫోన్ చేశామని.. మీ రక్షణ కోసమే కార్డు జారీ చేస్తున్నాం అంటూ నమ్మబలికి కస్టమర్ వద్ద ఉన్న కార్డు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను ఉపయోగించి కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నట్లు చెప్పారు. వివరాలు సేకరించిన తర్వాత నేరగాళ్లు క్రెడిట్ కార్డ్ నుంచి రూ.20వేల నుంచి రూ.లక్ష 40వేల వరకు డబ్బును పలు ట్రాన్సాక్షన్ల ద్వారా ఖర్చు చేశారని తేలింది. 

క్రెడిట్ కార్డ్ హోల్డర్లు నేరగాళ్ల బారినుంచి ఇలా రక్షణ పొందండి..
రిజర్వు బ్యాంక్ ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే క్రమంలో యూజర్లు తమ పర్సనల్ బ్యాంకింగ్, కార్డ్స్, యూపీఐ, సీవీవీ, ఓటీపీలు, పిన్ నంబర్లు, కనీసం ఫోన్ నంబర్లను కూడా షేర్ చేయెుద్దని సూచిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డ్ అందించిన సంస్థలు తమ కస్టమర్లను పైన పేర్కొన్న వివరాలను అడగవని గుర్తుంచుకోవాలని తమ ప్రకటనల్లో ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. 

ALSO READ : పన్ను అధికారుల సోదాలు.. ఏకకాలంలో 200 ప్రాంతాల్లో, మీరూ ఆ తప్పు చేస్తున్నారా..?

* కార్ హోల్డర్లు ఇలాంటి కాల్స్ అందుకుంటే వారు నిజమైన అధికారులా కాదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేసి ఆ నంబర్లను బ్లాక్ లిస్ట్ చేయాలి. 
* ఒకవేళ మీ డబ్బును వారు తస్కరిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ అధికారులను 1930 నంబరు ద్వారా సంప్రదించి కంప్లయింట్ రైజ్ చేయాలి. 
* పోన్ చేసినప్పుడు వారు ఏ కారణాల చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు, పాన్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్ నేమ్, పాస్ వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, క్రెడిట్ కార్డ్ నంబర్, ఓటీపీ, పిన్ నంబర్, యూపీఐ ఐడీ, సీవీవీ నంబర్, క్రెడిట్ కార్డ్ వివరాలు సహా మరే ఇతర వివరాలు అడిగినా చెప్పకూడదు. 
* వీటిపై వెంటనే యూజర్లు సైబర్ సెల్ పోలీసులను సంప్రదించటం లేదా sachet@rbi.org.inని సంప్రదించి కంప్లెయింట్ చేయటం ఉత్తమం. 
* ఇతరులు ఏవైనా డబ్బులు ఎరజూపి మీ ఖాతాలను సైబర్ నేరాలకు వాడుకోవాలనుకుంటే వెంటనే దానిని మీ బ్యాంకుతో పాటు పోలీసులకు తెలపటం మీకు చట్టబద్ధంగా రక్షణను కల్పించటమే కాకుండా అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా కాపాడుతుంది.